Vijayawada Traffic : కాల్ వస్తే వారికి 'రూట్ క్లియర్'...! జనాలకు మాత్రం అవస్థలు, పరిస్థితి మారెదెప్పుడు..?-frequent traffic jams and difficulties in clearing the escort vehicles in vijayawada city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Traffic : కాల్ వస్తే వారికి 'రూట్ క్లియర్'...! జనాలకు మాత్రం అవస్థలు, పరిస్థితి మారెదెప్పుడు..?

Vijayawada Traffic : కాల్ వస్తే వారికి 'రూట్ క్లియర్'...! జనాలకు మాత్రం అవస్థలు, పరిస్థితి మారెదెప్పుడు..?

Vijayawada Traffic : విజయవాడలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులతో పాటు వీఐపీ వాహనాలను రూట్ క్లియర్ చేసే క్రమంలో సాధారణ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.

విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీ (ఫైల్ ఫొటో) (image source facebook)

Vijayawada Traffic : విజయవాడ నగర వాసులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రోడ్డు ఎక్కితే అనుకున్న టైంలో గమ్యానికి చేరుతామా..? లేదా..? అన్నది గుబులు పుట్టిస్తోంది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు రహదారులపైనే గంటల తరబడి గడపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భారీ స్థాయిలో వాహనాలు రోడ్లపైకి వస్తుడంగా... మరోవైపు వీఐపీ వాహనాల రాకపోకలు నగరంలో ఎక్కువైపోయాయి.

ఓవైపు సాధారణ వాహనాలను నియంత్రిస్తూ రూట్ క్లియర్ చేయటమే సవాల్ గా ఉంటుంది. ఇదే సమయంలో వీఐపీ వాహనాల రూట్ క్లియర్ కోసం పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది. రూట్ క్లియర్ చేయాలంటే... సాధారణ వాహనాలను ఆపాల్సిందే..! దీంతో రోడ్లపై వాహనాల రద్దీతో తీవ్రంగా పెరిగిపోతుంది. రోడ్డంతా వాహనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. దీంతో సాధారణ జనం అవస్థలు పడుతున్నారు.

పైనుంచి ఆదేశాలు… పోలీసులపై ఒత్తిడి..!

మంత్రుల ఎస్కార్ట్ వాహనాలతో పాటు వీఐపీ వాహనాల రూట్ క్లియర్ చేసే క్రమంలో అసలు పని వదిలేసి వీఐపీ వాహనాల సేవలో పోలీసులు తరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకే సమయంలో సచివాలయానికి ఎస్కార్ట్ వాహనాలతో వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రులతో పాటు ప్రొటోకాల్ ఉన్న పలువురు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఎస్కార్ట్ కు రూట్ క్లియర్ చేసేందుకు టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చాలా మంది మంత్రుల ఎస్కార్టులు ఒకేసారి రోడ్లపైకి రావటంతో సామన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఎస్కార్ట్ కోసం రూట్ క్లియర్ చేయకపోతే మంత్రి కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్న పరిమామాలు కూడా వెలుగు చూస్తున్నాయి. రూట్ క్లియర్ లేకుండా ఇలాంటి ఘటనలు జరిగితే అధికారులు, సిబ్బందిపై మంత్రులు గుర్రుమంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. నగరంలో ముఖ్యంగా ఉదయం 10-11 మధ్య పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.

ఎస్కార్ట్ వాహనాల కోసం సాధారణ ట్రాఫిక్ ఆపేయాలని కంట్రోల్ రూమ్ పై ఎస్కార్ట్ సిబ్బంది ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ మేరకే పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ఏకకాలంలో న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రుల కోసం ట్రాఫిక్ క్లియర్ చేయాలని సమాచారం అందుతుండటంతో పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

సగటున 60-70 మంది VVIPల కోసం ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. డీజీపి, చీఫ్ సెక్రటరీ, పోలీసు ఉన్నతాధికారుల వాహనాలు వెళ్ళినా…. ట్రాఫిక్ ఆపేయాలని పైనుంచి ఆదేశాలు వస్తున్నాయంట..! దీంతో ఆటో నగర్ గేట్ నుంచి పటమట, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీఏ, రాఘవయ్య పార్క్, బందరు లాకులు, వై జంక్షన్, PCR, వినాయక టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ కూడళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఆగ్రహానికి లోనవుతున్న నగరవాసులు...

నగరంలో తరచూ ట్రాఫిక్ అపేసి ఎస్కార్ట్ వాహనాలు క్లియర్ చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గంటలకొద్ది రోడ్లపై వేచి చూసే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్ వంటి సమస్యలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసే పరిస్థితులు కనిపించటం లేదు. సాయంత్రం పూట డ్రంకెన్ డ్రైవింగ్ కేసులతో సరిపెడుతున్న వైనం నెలకొంది.

ట్రాఫిక్ ఇబ్బందులపై ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితుల్లో మార్పులు ఉండటం లేదన్న చర్చ వినిపిస్తోంది. ఎస్కార్ట్ వాహనాల కోసం రూట్ క్లియర్ చేసే విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఉండాలని… సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

 

సంబంధిత కథనం