శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ, ఇవిగో వివరాలు-free trips by apsrtc buses for the convenience of devotees in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ, ఇవిగో వివరాలు

శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ, ఇవిగో వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్. తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇవాళ టీటీడీ అధికారులు… జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

తిరుమలలో ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పులు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సులు నడవనున్నాయి. ఈ మేరకు ఉచిత బస్సు స‌ర్వీసును టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉచితంగా బస్ ట్రిపులు….

తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను టీటీడీ అద‌న‌పు ఈవో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ… తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుంచి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వ‌రిత‌గ‌తిన బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావ‌డంతో కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు తిరిగే మార్గంలోనే ఈ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని చెప్పారు. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు, ఆర్టీసీకి అద‌న‌పు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ 300 ట్రిప్పుల‌ను తిప్పుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వ‌డంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతమవ్వ‌డంతో పాటు బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు.

భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బ‌స్సులను ఎక్క‌డం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ఏ ప్రాంతంలో బ‌స్సు ఎక్కినా తిరుమ‌ల నుండి తిరుప‌తికి మాత్ర‌మే ఛార్జీలు ఉంటాయ‌ని… ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని ఆయ‌న భ‌క్తుల‌ను కోరారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.