AP SSC Exams: ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ-free journey in rtc buses for students going for class 10 exams in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Free Journey In Rtc Buses For Students Going For Class 10 Exams In Ap

AP SSC Exams: ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 01:22 PM IST

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు. విద్యార్ధులు హాల్ టిక్కెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఏపీలో పదో తరగతి పరీక్షలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

AP SSC Exams: పదో తరగతి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని, విద్యార్దులు హాల్ టిక్కెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ సదుపాయాన్ని ఏపీఎస్‌ఆర్టీసి కల్పిస్తుందని మంత్రి బొత్స ప్రకటించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు

పదో తరగతి పరీక్షల సందర్భంగా బస్సులు ఎక్కువగా తిప్పాలని ఆర్టీసీ అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. గత ఏడాది ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో ఈదఫా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. పరీక్షలలో కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను రోజూ సందర్శించాలని ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల్లో కొత్త విధానం…

పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా ఆరు పేపర్ల విధానం తీసుకొచ్చింది. పేపర్ల సంఖ్యను కుదించడంతో విద్యార్ధులు ఒకే సమయంలో ఎక్కువ సిలబస్‌ చదవాల్సి వస్తోందని చెబుతున్నారు. గతేడాది పరీక్షలు ఏడు పేపర్ల విధానంలో నిర్వహించారు. ఈ ఏడాది తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది బిట్‌ పేపర్‌ లేకుండానే పరీక్షల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. గత ఏడాది ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడం వల్లేనని విమర్శలున్నాయి.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కరోనా సమయంలో 8,9 తరగతులలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి ఉపాధ్యాయులు ప్రయత్నించినా చాలామంది విద్యార్థులు పురోగతి సాధించలేకపోయారు. సీబీఎస్‌ఈ విధానంలో ఐదు పేపర్లు ఉన్నా.. ఆ విద్యార్థులకు 20 శాతం అంతర్గత మార్కులతోపాటు ప్రశ్నాపత్రంలోనే 20 మార్కులు బహుళైచ్ఛిక ప్రశ్నలు కావడం వెసులుబాటు కల్పిస్తోంది. రాష్ట్ర పరీక్షలకు అలాంటి సదుపాయం లేదని ,విద్యార్దులకు దీని వల్ల ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

IPL_Entry_Point