ప్రేమగా మాటలు కలపుతారు. నెమ్మదిగా డేటింగ్‌కి పిలుస్తారు. చివరికి చీటింగ్ చేస్తారు. మోసాలే లక్ష్యంగా యాప్‌లోని మహిళలు, నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్నిచోట్ల నిలువుదోపిడీకి గురై యువకులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు, చదువుకునే విద్యార్ధులే వీరి బార్గెట్.
ఖాళీగా ఉన్నాం కదా... బోర్ కొడుతుందనో.. సరదాగా చాటింగ్‌కు దిగారా? ఇక అంతే సంగతులు. ఒక్కసారి వారి మాయలో పడితే.. రకరకాలుగా టార్చర్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన ఓ ఇంజనీర్‌కు డేటింగ్ యాప్‌లో ఓ మహిళ పరిచమైంది. తనది హైదరాబాద్ అని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు వీడియో కాల్ వరకు వచ్చారు. అన్నింటినీ ఆమె తన ఫోన్లో రికార్డు చేసింది. ఇక బెదిరింపులకు దిగింది. బంధువులు, స్నేహితులను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోలు పెడతానని బెదిరించి.. అతని నుంచి ఏకంగా రూ.28 లక్షలు వసూలు చేసింది.
ప్రస్తుతం అనేక రకాల చాటింగ్, డేటింగ్ యాప్‌లు మార్కెట్లో ఉన్నాయి. మెసేజ్‌లకు నగదు చెల్లిస్తే.. కొంత సమయం వరకు అమ్మాయిలు చాటింగ్ చేస్తారు. సమయం అయిపోయన తర్వాత అందులో డబ్బులు పెట్టి కాయిన్స్ కొనాల్సి ఉంటుంది. అలా కాయిన్స్ కొంటే.. మెసేజ్ చాటింగ్, వీడియో చాటింగ్ ఇలా వివిధ రకాలుగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి డబ్బులు కాజేయడం ప్రారంభమవుతుంది. యాప్ నిర్వాహకులు అమ్మాయిలను నియమించుకొని.. జీతం తోపాటు వారికి కస్టమర్ నుంచి వచ్చిన డబ్బులో కమిషన్ కూడా ఇస్తున్నారు. ఇలా పెద్దఎత్తున చాటింగ్, డేటింగ్ పేరుతో మాఫియా నడుపుతున్నారు.
యాప్‌లో వీడియో కాల్ చేయాలని యువతులు, మహిళలు రెచ్చగొడతారు. వారు చెప్పినట్లు చేసిన అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు జీవితం నాశనం చేసుకున్నారు. గతేడాది కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎంపీడీవో.. ఇలానే ఓ వీడియో చాట్ చేశారు. దాన్ని రికార్డు చేసుకున్న ఆ మహిళ.. ఎంపీడీవోను బెదిరించింది. రూ.20 లక్షల వరకు వసూలు చేసింది. అయినా వదిలిపెట్టలేదు. వీడియోలు ఉన్నతాధికారులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడగా.. చివరికి ఆ ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారు.
పని ఒత్తిడిలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వర్క్ ఫ్రం హోం చేసేవారు, విద్యార్థులు.. 22 నుంచి 35 ఏళ్ల వయసున్నవారే వీరి లక్ష్యం. ఒంటరిగా పీలవుతున్నారా? లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ కోరుకుంటున్నారా.. అంటూ తమవైపు లాగుతారు. హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి.. ఓ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయం అయింది. తాను వైద్యురాలినని, విదేశాల్లో ఉంటున్నానని మాట కలిపింది. ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే.. బాగా రిటర్న్ వస్తాయని నమ్మబలికింది. అలా అతని నుంచి తనకు తెలిసిన ఖాతాకు రూ.45 లక్షలు ట్రాన్స్‌ఫర్ యించుకుంది. ఆ తర్వాత ముఖం చాటేసింది. మోసపోయానని గుర్తించిన ఆ టెక్కీ.. పోలీసులను ఆశ్రయించారు.
విజయవాడకు చెందిన శేఖర్ అనే స్టూడెంట్‌కు.. యాప్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పబ్ వరకు వెళ్లింది. ఒకరోజు పబ్‌కు తీసుకెళ్లి.. అన్నీ ఖరీదైన వాటిని ఆర్డర్ చేసింది సదరు యువతి. రూ.20. నుంచి రూ.30 వేల వరకు శేఖర్‌తో ఖర్చుచేయించింది. అయితే.. అప్పటికే ఆ పబ్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్న యువతి.. కమీషన్ తీసుకుందని.. శేఖర్‌కు తెలిసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత కథనం