Varanasi Suicides: పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. డిసెంబర్ 3వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నలుగురు సభ్యుల కుటుంబం వారణాసికి వచ్చారు.
ఆంధ్రా ఆశ్రమంగా పరిగణించే కైలాష్ భవన్‌లో బస చేశారు. వీరిలో కొండబాబు (50), లావణ్య (45)లతో పాటు వీర వెంకట్ సూర్యమోహన్ రాజేష్ (25), జయరామ్ (23)లు ఉన్నారు. దేవనాథ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కైలాష్ భవన్‌లో డిసెంబర్ 7వ తేదీన నలుగురు శవాలై కనిపించారు. కొండబాబు , లావణ్య భార్యాభర్తలు కాగా రాజేష్, జయరామ్ వారి కుమారులుగా గుర్తించారు.
సత్రం గది నుంచి గురువారం ఎంత సేపైనా నలుగురు బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానించారు. గది తలుపులు కూడా ఒక్కసారి కూడా తెరవక పోవడం, తలుపు తట్టి పిలిచినా అలికిడి లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా లోపల నాలుగు మృతదేహాలు కనపించాయి. సత్రం గదిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న వారణాసి పోలీసు కమిషనర్ అశోక్ జైన్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు.
గదిలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసు కమిషనర్ అశోక్ జైన్ తెలిపారు. మృతులు నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారని.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా వివరించారు.
తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని, రెండు నెలలుగా ఇల్లు విడిచి వివిధ ప్రదేశాలకు తిరుగున్నారని గుర్తించారు. డబ్బులు తీసుకుని కొందరు తమను మానసికంగా వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.
నలుగురూ గురువారం ఉదయం గదిని ఖాళీ చేయవలసి ఉందని, గది నుంచి ఎటువంటి అలికిడి వినిపించకపోవడం.. ఎవరూ గది నుండి బయటకు రాకపోవడంతో కైలాష్ భవన్ ఉద్యోగులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.