TG IAS Officers: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ హైదరాబాద్‌లో ఊరట దక్కకపోవడంతో ఏపీ, తెలంగాణలలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేశారు. ఏపీకి కేటాయించినా గత పదేళ్లుగా తెలంగాణలో కొనసాగుతున్న వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ గురువారం ఉదయం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేశారు. బుధవారం వారు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించడంతో నలుగురు అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. అంతకు ముందే వారు మెయిల్ ద్వారా ఏపీ సీఎస్‌కు సమాచారం అందించారు.
మరోవైపు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. ఎన్టీఆర్ కలెక్టర్ గుమ్మళ్ల సృజన, లోతేటి శివశంకర్, హరికిరణ్‌లు హైదరాబాద్‌లో రిపోర్ట్ చేశారు. ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై నవంబర్‌లో విచారణ జరుగనుంది. వారి అభ్యంతరాలపై తుది ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఏపీ నుంచి రిలీవ్ అయిన అధికారుల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.