Palnadu Road Accident : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్ లోనే నలుగురు మృతి
Road Accident in Palnadu District : పల్నాడు జిల్లాలోని బ్రాహ్మణపల్లి దగ్గర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.
కొద్దిరోజులుగా ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లి దగ్గరలో అదుపు తప్పిన ఓ కారు… చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
కారు పూజ కోసం కొండగట్టుకు…
ప్రాథమిక వివరాల ప్రకారం… వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. ఇటీవలే కొన్ని కారుకు పూజలు చేయించారు. ఈ క్రమంలోనే తిరిగి స్వస్థలాని(సిరిపురం)కి వెళ్తుండగా… పిడిగురాళ్ల సమీపంలో ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని యోగులు,సురేశ్, వనిత, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వరుస రోడ్డు ప్రమాదాలు - జాగ్రత్త తప్పనిసరి అంటున్న పోలీసులు
ఇటీవలే అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీన విడపనకల్లులో 42వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు చనిపోయారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. తీవ్రమైన మంచుతో పాటు అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇదే కాకుండా నవంబర్ చివరి వారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 12 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా… మార్గమధ్యలో మరో ఇద్దరు, ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు.
ప్రస్తుతం శీతాకాలం కావటంతో ఉదయం సమయంలో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు వాహనాలు అతి వేగంతో వెళ్తుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ చలికాలంలో ఉదయం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పొగ మంచు ఎక్కువగా ఉంటే ప్రయాణాలు చేయకపోవటం మంచిదని చెబుతున్నారు. భద్రతా ప్రమాణాలను పాటించాలని… అతి వేగంగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
సంబంధిత కథనం