TTD Ghee Issue: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, సిట్ దర్యాప్తులోపురోగతి-four accused arrested in tirumala adulterated ghee case progress in sit investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Ghee Issue: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, సిట్ దర్యాప్తులోపురోగతి

TTD Ghee Issue: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, సిట్ దర్యాప్తులోపురోగతి

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 10, 2025 06:39 AM IST

TTD Ghee Issue: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు నిందితులను సిట్ అరెస్ట్‌ చేసింది. గత ఏడాది సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో నలుగురిని అరెస్ట్‌ చేశారు.

కల్తీ నెయ్యి కేసులో సిట్ అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులు
కల్తీ నెయ్యి కేసులో సిట్ అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులు

TTD Ghee Issue: తిరుమలలో లడ్డూ తయారీల కోసం వినియోగించే నెయ్యిలో కల్తీకి పాల్పడిన ఘటనలో నలుగురిని సిట్ అరెస్ట్‌ చేసింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సీబీఐ జేడీ పర్యవేక్షణలో సిట్‌ కొద్దినెలలుగా దర్యాప్తు చేస్తోంది. ఆదివారం లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారంలో 4గురిని సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. 

భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్)  డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు. 

క్రైం  నెంబర్ 470/24లో అరెస్టు చేసి నిందితులను  తిరుపతి కోర్టులో హాజరు పరిచారు.  ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారు.

తప్పుడు పత్రాలతో మోసం…

ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి  వైష్ణవి డైరీ టెండర్ కథ నడిపించినట్టు గుర్తించారు.  రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించింది.

భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో గుర్తించారు.  మూడు డైరీలకు చెందిన నలుగురు అరెస్టు చేశారు. 

ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌(45), పోమిల్‌ జైన్‌(47).. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలో ఉన్న వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్‌(69)లను అరెస్టు చేశారు. 

బినామీ పేర్లతో కాంట్రాక్టు దందా…

నెయ్యి కల్తీ జరిగిన కాలంలో విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో వివరించారు.  నలుగురు నిందితుల్ని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో వున్న సిట్‌ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8.30 గంటల నలుగురినీ భారీ భద్రత నడుమ వైద్య పరీక్షల నిమిత్తం  రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9గంటలకు 2వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు.  రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి.. నలుగురికీ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో వారిని తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.

గత ఏడాది సెప్టెంబర్‌ కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసింది.  తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారంపై  టీటీడీ మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ గత ఏడాది సెప్టెంబరు 25న ఫిర్యాదు చేయడంతో తిరుపతి ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశంతో  గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిగింది.

సిట్ దర్యాప్తులో వాస్తవాలు…

లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  సుప్రీంకోర్టు గత అక్టోబరు 4న సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీసు శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఫుడ్‌ సేఫ్టీ  స్టాండర్డ్స్‌ అథారిటీ నుంచి డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా సభ్యులుగా ఉన్నారు. 

నవంబరు 24న సిట్‌ దిగువ స్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబరు 13 నుంచి సిట్‌ కీలక సభ్యులు దర్యాప్తులో భాగం కావడంతో విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ల లాగ్‌ బుక్కులు, ట్రిప్‌ షీట్లు, ట్యాంకర్ల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం, డెయిరీల సిబ్బంది నుంచి సేకరించిన వివరాలను సిట్‌ బృందం  కీలక సమాచారం రాబట్టింది. 

వైష్ణవి డెయరీ నుంచి నెయ్యి సరఫరా…

టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ  నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేసింది. కేసు దర్యాప్తు అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలసి గత నాలుగు రోజులుగా ఏఆర్‌, వైష్ణవి డెయిరీలకు వెళ్లి యాజమాన్యాలను ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. రెండు డెయిరీలకు చెందిన మరో పది మంది సిబ్బంది ప్రస్తుతం సిట్‌ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. 

అందులో మేనేజర్‌ స్థాయి అధికారుల నుంచి.. ల్యాబ్‌ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు వరకు పలువురు ఉన్నారు.  వారిని కూడా  సోమ లేదా మంగళవారం అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఏఆర్‌ డెయిరీ, బోలేబాబా, వైష్ణవి డెయిరీల కార్యాలయాలతోపాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్‌ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు అంగీకరించడం వెనుక మతలబేమిటో గుర్తిస్తున్నారు.

నెయ్యి  కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులెవరైనా సహకరించారా అంశాలపై అరా తీస్తున్నారు. రిమాండ్‌ రిపోర్టులో రాజు రాజశేఖరన్‌ను ఏ-2గా, పోమిల్‌జైన్‌ను ఏ-3గా, విపిన్‌ జైన్‌ను ఏ-4గా, అపూర్వ చావ్దాను ఏ-5గా పేర్కొన్నారు. కల్తీ నెయ్యి కేసులో ఏ1 ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. టీటీడీ బోర్డులో గతంలో పనిచేసిన వారు కానీ, టీటీడీ అధికారులను కానీ ఏ1గా చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. 

Whats_app_banner