నువ్వే మారిపోయావ్ జగన్.. విజయసాయి కౌంటర్‌ కామెంట్స్ అంటూ వైరల్.. ఖండించిన మాజీ ఎంపీ-former mp vijayasai reddy responded to jagan press meet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నువ్వే మారిపోయావ్ జగన్.. విజయసాయి కౌంటర్‌ కామెంట్స్ అంటూ వైరల్.. ఖండించిన మాజీ ఎంపీ

నువ్వే మారిపోయావ్ జగన్.. విజయసాయి కౌంటర్‌ కామెంట్స్ అంటూ వైరల్.. ఖండించిన మాజీ ఎంపీ

ఇటీవల జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే రాజీనామా చేశారని ఆరోపించారు. ఆ కామెంట్స్‌పై తాజాగా విజయసాయి రెడ్డి స్పందించారని కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని విజయసాయి రెడ్డి ఖండించారు.

జగన్ వర్సెస్ విజయసాయి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై.. విజయసాయి రెడ్డి స్పందించినట్టు కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారని.. తాను ఎవ్వరికీ లొంగనని విజయసాయి స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి.

నువ్వే మారిపోయావ్..

'నేను మారను. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావ్‌. నేను ప్రలోభాలకు లొంగను. ఎవ్వరికీ భయపడను. విశ్వసనీయత కోల్పోయే తత్వం నాది కాదు. గతంలో మా నాయకుడిపై, ఇప్పుడు దేవుడిపై భక్తి ఎప్పుడూ ఉంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. బాధలు భరించలేకే తప్పుకున్నాను. ప్రశాంతంగా.. హాయిగా ఉన్నా' అనే కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఆ ప్రకటన నాది కాదు..

అయితే.. వాటిని విజయసాయి రెడ్డి ఖండించారు. 'నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది. ఆ ప్రకటన నాది కాదు. నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి. గమనించగలరు' అని విజయసాయి ట్వీట్ చేశారు.

జగన్ ఏమన్నారు..

22వ తేదీన గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇంకొకాయన విజయసాయి రెడ్డి. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరాలు టర్మ్‌ ఉండగా.. చంద్రబాబు నాయుడు కూటమికి మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు' అని జగన్ చెప్పారు.

వాల్యూ ఉంటుందా..

'వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు. మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉండదు అని తెలుసు. అయినా.. తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి.. తన మూడున్నర సంవత్సరం టర్మ్‌‌ను కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఎవర్ని అయినా తీసుకుని ఇదే మాదిరిగా చెప్పిస్తే వ్యాల్యూ ఉంటుందా?' అని జగన్ ప్రశ్నించారు.

జనవరిలో రాజీనామా..

విజయసాయి రెడ్డి ఈ ఏడాది జనవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి.. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ప్రకటించిన విజయసాయి.. తన నిర్ణయాన్ని ప్రకటించిన మరునాడే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

లిక్కర్ స్కామ్‌లో..

ఆ తర్వాత కొన్ని రోజులకు లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా విజయసాయిని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి గురించి కీలక విషయాలు మాట్లాడారు. తాను పూర్తిగా విచారణకు సహకరిస్తానని.. స్పష్టం చేశారు. అప్పుడు విజయసాయి మాట్లాడిన మాటలపై తాజాగా జగన్ స్పందించారు.

సంబంధిత కథనం