రేపు సిట్‌ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మద్యం కేసులో కీలక పరిణామాలంటూ ఊహాగానాలు..-former mp vijaya sai reddy to appear before sit tomorrow speculations on key developments in liquor case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రేపు సిట్‌ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మద్యం కేసులో కీలక పరిణామాలంటూ ఊహాగానాలు..

రేపు సిట్‌ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మద్యం కేసులో కీలక పరిణామాలంటూ ఊహాగానాలు..

Sarath Chandra.B HT Telugu

Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం విక్రయాల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. మద్యం విక్రయాలు, కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో 3వేల కోట్లకు పైగా దారి మళ్లించారనే ఆరోపణలతో సిట్‌ విచారణ సాగుతోంది.

ఏపీ మద్యం విక్రయాల్లో అక్రమాలపై సిట్‌ దర్యాప్తులో దూకుడు (istockphoto)

Vijayasai Reddy: ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై సిట్‌ విచారణలో వేగం పెరిగింది. గురువారం సిట్‌ విచారణకు రావాలని మాజీ ఎంపీ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి… మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి పేరును ప్రస్తావించారు. సాయిరెడ్డి ప్రకటన తర్వాత వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ చేయకుండా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.

సాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తూ సిట్‌ విచారణకు పిలిచిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.వైసీపీ ప్రభుత్వ హయంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఓ దశలో వైసీపీలో నంబర్‌ 2గా చలామణీ అయ్యారు. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడితో దూరం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

ఒక రోజు ముందే విచారణ..

గత ఐదేళ్లలో మద్యం విక్రయాల్లో జరిగిన అక్రమాలపై విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 18 శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నా గురువారం విచారణకు వస్తానని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సాయిరెడ్డిని విచారించనున్నారు.

బీఎన్‌ఎస్‌ సెక్షన్ 179 ప్రకారం మద్యం కొనుగోళ్లు, డిస్టలరీలకు ఆర్డర్లు, విక్రయాలపై సాక్ష్యం ఇచ్చేందుకు ఆయన్ని పిలిచారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వాస్తవాలు, వాటికి సంబంధించిన సమాచారం తెలిసినందున, కేసు దర్యాప్తులో భాగంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్ బృందం ఈ నోటీసులు అందజేసింది.

అసలు టార్గెట్‌ కోసమే దర్యాప్తు..?

మద్యం వ్యవహారంలో అంతిమంగా నిధులు ఎక్కడికి ప్రవహించాయనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. వైసీపీ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు జరిగినా ఆర్డర్లు మాత్రం కొందరి కనుసన్నల్లో జరిగేవని ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, నెలకు రూ.60 కోట్ల చొప్పునరూ.3వేల కోట్లు వసలు చేశారని అనుమానిస్తోంది. ఈ డబ్బులు కొందరు మధ్యవర్తుల ద్వారా వైసీపీలో కీలకమైన వ్యక్తులకు చేరాయని అనుమానిస్తున్నారు. సాయిరెడ్డిని విచారిస్తే ఈ గుట్టు బయట పడుతుందని భావిస్తున్నారు.

మరోవైపు సాయిరెడ్డి ఇప్పటికే మద్యం కేసులో ఏమి జరిగిందో వాస్తవాలు బయటపెట్టేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సిట్‌ విచారణకు హాజరైన సమయంలోనే సూత్రధారులు, పాత్ర ధారుల పేర్లను ఆయన ప్రస్తావించారు. సాయిరెడ్డి వెల్లడించే వివరాల ఆధారంగా మద్యం కేసులో భవిష్యత్ పరిణామాలు ఉండొచ్చని తెలుస్తోంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం