ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారన్న రజిని.. అక్రమ కేసులకు భయపడను, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో.. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని, డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు రావడంతో.. ఏసీబీ రంగంలోకి దిగింది. ఆమెతో పాటు నాటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ.. ఇటీవలనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకుంది. విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు కూడా లేఖ రాసింది. ఈ లేఖకు రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఆమెపై తాజాగా కేసు నమోదు చేశారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ ఉంది. దాని యజమానిని బెదిరించి రూ. 2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
విడదల రజిని చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పని చేశారు. జగన్ హయాంలో మంత్రివర్గ నిస్తరణ జరిగినప్పుడు ఆమెకు అవకాశం వచ్చింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా బాధ్యతలు రజిని బాధ్యతలు నిర్వర్తించారు.