మాజీ మంత్రి విడదల రజిని, సీఐ మధ్య వాగ్వాదం- పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ట్వీట్-former minister vidadala rajini clash with ci ysrcp alleges police brutality in nda govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మాజీ మంత్రి విడదల రజిని, సీఐ మధ్య వాగ్వాదం- పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ట్వీట్

మాజీ మంత్రి విడదల రజిని, సీఐ మధ్య వాగ్వాదం- పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ట్వీట్

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జనం చేశారని వైసీపీ ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సీఐ వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించే రజిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మాజీ మంత్రి విడదల రజిని, సీఐ మధ్య వాగ్వాదం- పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ట్వీట్

పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో మాజీ మంత్రి విడదల రజిని, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో...ఘర్షణ తలెత్తింది. శ్రీకాంత్ ను ఎందుకు అరెస్టు చేస్తు్న్నారని మాజీ మంత్రి రజిని పోలీసులను ప్రశ్నించారు. ఓ దశలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విడదల రజిని అనుచరుడి అరెస్టు క్రమంలో

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజిని తన అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని, విడదల రజిని వాహనాన్ని అడ్డుకున్నారు.

విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్టు చేస్తున్నట్లు​ పోలీసులు ఆమెకు తెలిపారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని రజిని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్న శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా...విడదల రజిని అడ్డుకున్నారు. వాహనంలోకి వెళ్లి డోర్ వేసుకునేందుకు రజిని ప్రయత్నించారు.

బలవంతంగా డోర్ లాగి

దీంతో అక్కడున్న సీఐ వాహన డోర్ బలవంతంగా లాగి...వాహనంలోని శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విడదల రజిని, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. విడుదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారని వైసీపీ ఆరోపిస్తుంది. ఆమెను సీఐ పక్కకు నెట్టేశారని ఓ వీడియో పోస్టు చేసింది. ఒక మహిళ, మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆరోపించింది.

ఓ కేసులో శ్రీకాంత్ ను అరెస్టు చేస్తుండగా...విడదల రజిని అడ్డుకునే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ కక్ష

"దేశం యుద్ధంలో...రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయ కక్ష. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యం చేశారు. రజిని కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబ్బందితో వచ్చిన సీఐ సుబ్బారాయుడు... అరెస్ట్ కి కారణం అడుగుతూ మాజీ మహిళా మంత్రి రజిని మాట్లాడుతుండగానే రోడ్డుపై సీఐ హద్దులు దాటి ప్రవర్తించారు" -వైసీపీ ట్వీట్

రజినికి సరైన సమాధానం చెప్పకుండానే కేసు బుక్ చేస్తానని బెదిరిస్తూ.. ఆమెని పక్కకి నెట్టేస్తూ కారులోకి దూసుకెళ్లారు సీఐ. ఇదేనా ఫ్రెండీ పోలీస్ అంటే? ఇదేనా మహిళలకి మీరు ఇచ్చే గౌరవం... సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వంగలపూడి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం