Punganur Girl Missing : మీ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా? : రోజా
Punganur Girl Missing : పుంగనూరులో బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇష్యూపై తాజాగా మాజీమంత్రి రోజా స్పందించారు. ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి.
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. కనిపించకుండా పోయిన బాలిక సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో శవమై తేలింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆర్కే రోజా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు.

ఫైల్స్‌కు ఉన్న విలువ లేదా..
'మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే హెలికాప్టర్‌లో అధికారులను పంపిస్తారు.. రాష్ట్రంలో మహిళల్ని కిడ్నాప్ చేసినా.. రేప్ చేసి చంపేసినా హెలికాఫ్టర్‌ను, అధికారులను పంపరు. మీ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా?. ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది' అని మాజీమంత్రి రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సొంత జిల్లాలోనే ఇలా అయితే..
'ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే.. ఇది ప్రభుత్వ అసమర్ధత కాదా? గత నెల 29న అదృశ్యమైన పాప.. నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లోనే ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారు. పుంగనూరు ఘటన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా' అని రోజా వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది..
పుంగనూరుకు చెందిన ఆరేళ్ల బాలిక గత ఆదివారం (సెప్టెంబర్ 29) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కరెంట్ పోయింది. బాలిక తల్లి బయటకు వచ్చి చూస్తే పాప కనిపించలేదు. వెంటనే ఆమె ఫోన్ ద్వారా ఈ విషయాన్ని భర్తకు తెలిపింది.
అక్టోబర్ 2న..
పాప కోసం కుటుంబ సభ్యులు రాత్రి పది గంటల వరకూ పలుచోట్ల గాలించారు. కానీ.. ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అక్టోబర్ 2వ తేదీన పుంగనూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో బాలిక శవమై తేలింది.