Perni Nani : నా భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారు : పేర్ని నాని
Perni Nani : మాజీమంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దగ్గర కూడా ఈ విషయంపై చర్చించారన్న నాని.. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని వివరించారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలు ఆపడం లేదన్నారు.
మాజీమంత్రి పేర్ని నాని భార్యను అరెస్టు చేస్తారని.. ఇటీవల ప్రచారం జరుగుతోంది. బియ్యం గోదాంకు సంబంధించి అక్రమాలు జరిగాయని, ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా పేర్ని నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలని.. ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారం..
'ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే.. సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైంది. పోలీసుల విచారణ పూర్తి కాకముందే.. ఉద్దేశపూర్వకంగా తమను దొంగలుగా ప్రచారం చేస్తున్నారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారుయ
అద్దె కోసమే..
'60 ఏళ్లకు వస్తున్నాం. ఈ వయస్సులో ఏ వ్యాపారం, కాంట్రాక్టులు చేయలేం. త్వరలో బందరు పోర్టు అవబోతోంది. ఎవరో ఒకరు అద్దెకు తీసుకుంటారు. అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్‌లో స్టాక్ ఉంచారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు' అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
ఆలస్యంగా నోటీసులు..
'కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. పదో తారీకు కలెక్టర్ ఇచ్చిన నోటీసును ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా ఇచ్చారు. అయినా ఇబ్బంది పడుతూనే సకాలంలో డబ్బు చెల్లించాము. నైతిక బాధ్యతతో బియ్యం తాలూకు డబ్బును ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం' అని పేర్ని నాని స్పష్టం చేశారు.
డీజీపీ వార్నింగ్..
'కాకినాడ పోర్ట్‌లో బియ్యం రవాణాపై సిట్ విచారణ చేస్తోంది. పీడీఎస్ బియ్యం స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమంగా బియ్యం సరఫరా చేసేవారిపై.. కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను.. సీరియస్‌గా తీసుకున్నాం. ఈ ఏడాది 572 కేసులు నమోదు చేశాం. 212 మందిని అరెస్ట్ చేశాం' అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.