Former minister Alla Nani : టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని
మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆళ్ల నాని… వైసీపీకి రాజీనామా చేశారు.

మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం గూటికి చేరారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో… పార్టీ కండువా కప్పుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పట్లోనే టీడీపీలో చేరుతారనే వార్తలు వచ్చినప్పటికీ… ముహుర్తం ఖరారు లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో… టీడీపీలో చేరారు.
లైన్ క్లియర్….
2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా ఆళ్ల నాని టీడీపీలో చేరిపోయారు.
నాని చేరికపై తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు గట్టిగా వ్యతిరేకించినట్లు తెలిసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని తమను ఇబ్బందులకు గురిచేశారని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారిని సముదాయించటంతో నాని రాకకు లైన్ క్లియర్ అయిపోంది.
జగన్ కేబినెట్ లో మంత్రిగా….
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి... జగన్ తో నడిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోటా రామారావు విజయం సాధించారు.
ఇక 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకి రావటంతో ఆయన్ను మంత్రి పదవి వరించింది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన్ను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నంచే పోటీ చేసిన నాని... ఓటమిపాలయ్యారు. టీడీపీ తరపున పోటీ చేసిన రాధాకృష్ణయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 62 వేల ఓట్ల తేడాతో ఆళ్ల నాని ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత... పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్ల నాని దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీటీడీతో చర్చలు జరపగా… ఎట్టకేలకు పార్టీ కండువా కప్పుకున్నారు.
సంబంధిత కథనం