Former IAS Imtiaz Ahmed : వీఆర్ఎస్ తీసుకుని మరీ ఎమ్మెల్యేగా పోటీ...! ఇంతలోనే రాజకీయాలకు మాజీ ఐఏఎస్ గుడ్ బై..!
Former IAS Officer Imtiaz Ahmed : వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ పోటీ చేసి ఓడిపోయారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ప్రకటించారు. ఈ మేరకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.
సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రకటనలో ఇంతియాజ్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని.. కర్నూలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయానని ప్రస్తావింఛారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా మెరుగైన సమాజం కోసం తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
ఇలా చేరి.. అలా టికెట్ దక్కించుకున్న ఇంతియాజ్
సీనియర్ ఐఏఎస్ అధికారిగా పేరొందిన ఏ.ఎండి ఇంతియాజ్ అహ్మద్ కొన్ని నెలల కిందటే వైసీపీలో చేరారు. ఇందుకోసం ఆయన ఐఏఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీఆర్ఎస్ ఇచ్చిన వెంటనే… వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అంతేకాదు… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కర్నూలు వైసీపీలో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్ ను సిద్ధం చేశారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, స్థానికంగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ల కోసం చివరి వరకు రేసులో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇంతియాజ్ ఎంట్రీతో ఈ గొడవకు బ్రేక్ పడింది. వీరిద్దరికీ కాకుండా… కర్నూలు సీటును ఇంతియాజ్ కు కట్టబెట్టారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో 18,876 ఓట్ల తేడాతో ఇంతియాజ్ ఓడిపోయారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న ఇంతియాజ్ కు 72,814 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత… ఇంతియాజ్ పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ముందులేరు. ఈ క్రమంలోనే… ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కీలక సమయంలో పార్టీ తరపున టికెట్ తీసుకున్న ఇంతియాజ్ నిర్ణయంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కష్ట సమయంలో అండగా ఉండకుండా… ఇలా వెళ్లిపోవటమేంటన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి.
ఇక ఇంతియాజ్ అహ్మద్ ది సొంత జిల్లా కర్నూలు. ఆయన గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నిజాయితీ గల అధికారిగా పేరున్న ఇంతియాజ్..తన కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా ప్రజా సేవలో చురుకుగా ఉంటున్నారు. తన బావ డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ కర్నూలు నగరంలో రూ.2 వైద్యుడిగా పేరుపొందారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కొవిడ్ -19 సమయంలో మరణించారు. అతను తన సేవలను పేదలకు విస్తరించడానికి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పేదలు డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ దగ్గర చికిత్స పొందేందుకు కర్నూలుకు వచ్చేవారు.