విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన చట్టంలో భాగంగా విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో నిర్మాణం జరగాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టులపై కొత్త డీపీఆర్‌లపై కసరత్తు జరిగింది. ఎంపిక చేసిన కారిడార్లలో మెట్రో రైళ్లను పరుగులు తీయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు అవసరమై నిధులు సమీకరించేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు వచ్చాయి. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమయ్యారు.
KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల ప్రతినిధులు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రెండు మెట్రో ప్రాజెక్ట్ లకు అయ్యే వ్యయంలో రూ.12వేల కోట్ల రుణం అవసరం అవుతుందని అంచనా వేశారు. విశాఖ మెట్రోకు రూ. 6100 కోట్లు,విజయవాడ మెట్రోకు 5900 కోట్లు రుణం సమీకరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మెట్రో ప్రాజెక్టుకు తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.
విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చురుగ్గా కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనుల్ని పట్టాలెక్కించాలని యోచిస్తున్నారు.
సంబంధిత కథనం