భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి - లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు-flood levels in godavari are gradually increasing warnings issued for catchment areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి - లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి - లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

గోదావరిలో వరద ఉద్ధృతి ప్రవాహం పెరుగుతోంది. దీంతో భద్రాచలం, ధవళేశ్వరం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పరివాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భద్రాచలం (ఫైల్ ఫొటో)

ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో…. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు.

ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. గోదావరి నదీపరీవాహక ప్రాంతం,లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.

భద్రాచలం వద్ద పరిస్థితి ఇలా….

భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరింది. ప్రస్తుతం 8,19,285 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. నీటిమట్టం 40 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.