Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం
Flood Victims Protest: విజయవాడ వరదల్లో మునిగిన బాధితులకు పరిహారం చెల్లింపు ప్రహసనంగా మారింది. ఎవరికి పరిహారం చెల్లించారనే వివరాలను కూడా అధికారులు వెల్లడించక పోవడంతో బాధితులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
Flood Victims Protest: బుడమేరు వరద బాధితులకు పరిహారం అందించడంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. బాధితులు అందరికీ వరద సహాయం అందించాలని బాధితులు ధర్నా చేపట్టారు. వరద పరిహారం విడుదలై పది రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తి కాలేదు. క్షేత్ర స్థాయిలో అన్యుమరేషన్ లోపభూయిష్టంగా సాగడంతో అర్హులైన బాధితులకు వరద సాయం అందకుండా పోయింది. ముఖ్యమంత్రి చివరి బాధితుడి వరకు నష్ట పరిహారం అందాలని పదేపదే చెబుతున్నా ప్రభుత్వ సిబ్బందిలో మాత్రం చలనం రావడం లేదు.
దీంతో గురువారం వేలాదిమంది బాధితులు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు తరలివచ్చారు. పది రోజుల పాటు బుడమేరు వరదల్లో ముంపుకు గురైన బాధితులకు నష్టానికి అనుగుణంగా సహాయం రెట్టింపు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
వరద సహాయంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. వరదలు వచ్చి 33 రోజులు గడిచినా వేలాది మంది బాధితులకు ఇంకా ఎలాంటి సహాయం అందలేదని ఆరోపించారు.
రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది?
వరదల్లో జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం 7వేల కోట్ల రూపాయల సహాయం వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా 5వ తేదీ లోపు సహాయం అందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.
రియల్ టైం గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం 33 రోజులు గడిచినా బాధితులు అందరికీ సహాయం అందించడంలో వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ వేలాదిమంది సహాయం అందక కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం మాత్రం బాధితులు 95 శాతం మందికి సహాయం అందించామని ప్రకటనలు చేయటం శోచనీయమని, అందరికీ సహాయం అందితే వేలమంది కార్యాలయాల వద్దకు వచ్చి దరఖాస్తులు ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ముందస్తుగా వరద హెచ్చరికలు చేయటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని, గత ప్రభుత్వం వరద ముంపు నివారణ చర్యలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఏడు వేల కోట్ల రూపాయల వరద సహాయాన్ని ఇవ్వాలని కోరినా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా అడ్వాన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని, రాష్ట్రంలోని దాతలు, సంస్థలు 500 కోట్ల రూపాయలపైగా ప్రభుత్వానికి విరాళాల రూపంలో అంద చేశారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిధుల నుండి బాధితులను ఆదుకోవటానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఇంటిలో లక్ష నుండి పది లక్షల రూపాయలు పైగా నష్టం జరిగిందని, అత్యధికులు సర్వస్వం కోల్పోయారని, చిరు వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినడంతో ఉపాధి లేకుండా పోయిందని వివరించారు. వరద అనంతరం ప్రభుత్వం కొన్ని చర్యలు వేగంగా తీసుకున్నా, దిగువ స్థాయికి సహాయం అందలేదని, ముఖ్యమంత్రి పర్యటించినా స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండా పోయారని, కూటమి నేతలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు.
విజయవాడ నగర పాలక సంస్థలో పాలక పక్షంగా ఉన్న వైసిపి ప్రజా ప్రతినిధులు చేతులెత్తేశారని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా 5వ తేదీలోగా అందరికీ సహాయం అందించాలపి. వరద బాధితుల నమోదులో అధికార యంత్రాంగం లోపభూయిష్టమైన నిబంధనలతో తప్పుల తడకలతో జాబితా రూపొందించారని మ్యాపింగ్ ఇతర కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు.
కుటుంబాలకు ఆర్థిక సహాయం 50 వేలకు, ఆటోలకు 25 వేలకు, మోటార్ సైకిళ్లకు 10 వేల రూ" కు, చిరు వ్యాపారులకు 50 వేల నుండి లక్ష రూపాయలకు సహాయం పెంచాలని డిమాండ్ చేశారు.
వరద బాధితుల నుండి విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడం దారుణమని, ఇంటి పన్నులు కూడా మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశాలు ఇవ్వటం గర్హనీయమని మండిపడ్డారు. పొదుపు సంఘాల బ్యాంకు రుణాలపై ప్రభుత్వం ప్రకటన చేయలేదని, బ్యాంకు అకౌంట్లలో తేడాల పేరుతో బాధితులను పది రోజుల నుండి బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. సమస్యకు పరిష్కారం చూడటం లేదు, బ్యాంక్ అకౌంటు లేని వారికి నేరుగా సహాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబురావు డిమాండ్ చేశారు.