Vijayawada : పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం.. ఉదయం పూట ప్రయాణం జాగ్రత్త!-flight operations disrupted at gannavaram airport due to fog ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం.. ఉదయం పూట ప్రయాణం జాగ్రత్త!

Vijayawada : పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం.. ఉదయం పూట ప్రయాణం జాగ్రత్త!

Basani Shiva Kumar HT Telugu
Jan 24, 2025 01:20 PM IST

Vijayawada : ఏపీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 దాటినా పొగమంచు క్లియర్ కాలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా మంచు కారణంగా గన్నవరం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.

విజయవాడ ఎయిర్‌పోర్ట్
విజయవాడ ఎయిర్‌పోర్ట్

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొగమంచు దట్టంగా కురిసింది. గన్నవరంలో భారీగా పొగమంచు కురిసిన కారణంగా.. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లేవి, వచ్చే సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రన్‌వే విజిబులిటీ లేక ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రెండు విమానాలు సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వచ్చాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

కమ్మేసిన పొగమంచు..

పలు విమానాలు ఉదయం తొమ్మిదిన్నర తర్వాత విమానాశ్రయం చేరుకొని.. తిరిగి గమ్య స్థానాలకు బయల్దేరినట్లు గన్నవరం, విశాఖ ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు. అటు ఏపీలోని జాతీయ రహదారులను పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై హెడ్‌లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి.

హైదరాబాద్ శివార్లలో..

ఇక హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ఎల్బీ నగర్ హయత్‌నగర్‌తో పాటు నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని స్థితి నెలకొంది. దీంతో కూడళ్లు, డివైడర్ క్రాసింగ్‌ల వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

ఈ సీజన్‌లో ప్రయాణం తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు, కార్ల లైటింగ్‌ (పార్కింగ్‌ లైట్లు) ఉండేలా చూసుకోవాలి. 50 మీటర్ల దూరం ఉండగానే బ్రేక్‌ను ఉపయోగించాలి. రోడ్డుపై, మార్జిన్లలో వాహనాలు ఆగిపోతే కచ్చిత సంకేతాన్నిచ్చేలా రేడియం స్టిక్కర్, సూచికలు ఉపయోగించాలి. క్యాబిన్‌ అద్దాన్ని లోపల, వెలుపల పొడి గుడ్డతో తుడవాలి. డ్రైవింగ్‌లో సుధీర్ఘ అనుభవం ఉన్నవారే తెల్లవారుజామున వాహనాలు నడపాలి.

ఫేస్‌వాష్‌ అండ్‌ గో..

ఈ సీజన్‌లో ఉదయం పూట తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల అనంతపురం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన జాతీయ రహదారులపై ‘ఫేస్‌వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల పోలీసులు అమలు చేస్తే బాగుటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Whats_app_banner