డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు జరిగి ఆరుగురు చనిపోయారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ఆరుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. చాలా మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని అనపర్తి ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది వరకు కార్మికులు అందులో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. పేలుడు భారీగా ఉండటంతో షెడ్డు గోడ కూడా కూలింది. అయితే ఆ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి రామచంద్రపురం ఆర్డీవో అఖీల వెళ్లారు. బాణసంచా కేంద్రంలో మంటలు చెలరేగాడానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమా అనే అనుమానాలు ఉన్నాయి.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ మాట్లాడారు. వారం కిందట బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారని, అన్ని రకాల రక్షణ చర్యలు ఉన్నట్టుగా నివేదిక ఇచ్చారని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, వైద్య సాయాన్ని అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు పరిస్థితి సద్దుమణిగే వరకూ అక్కడే ఉండాలన్నారు.
అగ్నిప్రమాదం మీద హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని హోం మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.