AP Municipal Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపులపై 50శాతం వడ్డీ రాయితీ.. 100శాతం మినహాయించాలని పౌరసమాఖ్య డిమాండ్-fifty percent discount on property tax dues payment in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Municipal Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపులపై 50శాతం వడ్డీ రాయితీ.. 100శాతం మినహాయించాలని పౌరసమాఖ్య డిమాండ్

AP Municipal Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపులపై 50శాతం వడ్డీ రాయితీ.. 100శాతం మినహాయించాలని పౌరసమాఖ్య డిమాండ్

Sarath Chandra.B HT Telugu

AP Municipal Tax: ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే వారికి వడ్డీలో 50శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బకాయిల్ని ఒకేసారి చెల్లించే వారికి ఇది వర్తిస్తుంది. మరోవైపు ఆస్తిపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నుల్లో వడ్డీని 100శాతం రద్దు చేయాలని పట్టణ పౌర సమాఖ్య డిమాండ్ చేస్తోంది.

ఆస్తి పన్నుల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పౌర సమాఖ్య

AP Municipal Tax: ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో బకాయిల వసూలు కోసం ఏపీప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించింది. ఒకేసారి పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ పై 50% తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ జీవో విడుదల చేసింది. మార్చి 31లోగా బకాయిల్ని ఏకమొత్తంలో చెల్లిస్తే వారికి 50శాతం రాయితీ ఇస్తామని జీవోఎంఎస్‌ 46 విడుదల చేసింది.

ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల్ని మార్చి 31లోగా చెల్లించే వారికి వడ్డీలో 50శాతం రాయితీ చెల్లించనున్నట్టు జీవో పేర్కొన్నారు. ఈ సదుపాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మొత్తం వడ్డీ తో సహా పన్ను కట్టిన వారందరికీ వర్తిస్తుంది. ఇప్పటికే వడ్డీ చెల్లించిన వారికి 50 % వడ్డీ రాయితీ రానున్న ఆర్థిక సంవత్సర పన్నులకు జమ చేస్తారు.

ప్రత్యేకకౌంటర్లు ఏర్పాటు..

ఆస్తి పన్ను వసూళ్ల కోసం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 13 క్యాష్ కౌంటర్లలతో పాటు మూడు జోనల్ కార్యాలయాలలో ఉన్న ఆరు క్యాష్ కౌంటర్లను ఉదయం 8:00 నుండి సాయంత్రం 8 గంటల వరకు మార్చ్ 31, వరకు, మునిసిపల్ పన్ను వసూలు కేంద్రాల్లో క్యాష్ కౌంటర్లు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని విజయవాడ కమిషనర్‌ ధ్యాన చంద్ర తెలిపారు.

ఆస్తి పన్ను బకాయిలు ఈ నెల 31 లోపు చెల్లించాలని, గడువు లోపు ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ అడిషినల్ డైరక్టర్ సి. అనురాధ తెలిపారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నుల్ని మొదటి అర్థ సంవత్సరానికి జూన్, రెండవ అర్థసంవత్సరానికి డిసెంబర్ లోపు పన్ను చెల్లించని వారు 2శాతం వడ్డీ తో చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపుదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పురపాలక సంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూళ్ళ కోసం ఆస్తి పన్ను, ఖాళీ స్థలంపై పన్నులు ఈ నెల 31లోపు ఏకమొత్తంలో ఒకే సారి చెల్లించిన వారికి వడ్డీపై 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు.

100శాతం రాయితీ ఇవ్వాలని పట్టణ పౌరసమాఖ్య డిమాండ్..

పట్టణాలలో ఆస్తిపన్ను బకాయిలపై 100% వడ్డీ రాయితీ ఇవ్వాలని, బకాయిల చెల్లింపుకు రెండు నెలల సమయం ఇవ్వాలని, జీవో 46 లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌరసమాఖ్య డిమాండ్ చేసింది. పట్టణాలలో ఆస్తి పన్ను బకాయిలపై నెలాఖరు వరకు 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తూ, ఆరు రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు ఊరట, సంతృప్తి కలిగించే విధంగా లేవని సమాఖ్య కన్వీనర్ చిగురుపాటి బాబురావు విమర్శించారు.

పాత బకాయిలతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించే పన్నులపై కూడా 24% వడ్డీ వసూలు చేయటం సమంజసం కాదని, గత నాలుగు సంవత్సరాలనుండి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం ఆధారంగా ప్రతి సంవత్సరం 15% చొప్పున 100% ఇంటి పన్ను పెంచారని, ఈ భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పన్నులు, వడ్డీ వసూళ్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ముడిపెట్టారని ఆరోపించారు.

తెలంగాణలో 90శాతం రాయితీ..

ఆస్తి పన్నులపై తెలంగాణలో 90 శాతం వడ్డీ రాయితీ ఇస్తూ మార్చి 8వ తేదీన ఆదేశాలు ఇచ్చారని, ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. గతంలో మన రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాల్లో వడ్డీ రద్దు చేశారని, తాజా జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. మే నెలాఖరు వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించాలన్నారు. ఏప్రిల్‌ నుంచి పెరగనున్న ఆస్తి పన్నుల భారాన్ని రద్దుచేయాలని, 2020లో అమల్లోకి తెచ్చిన ఆస్తి పన్నులు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం