Trains Cancellation: పండుగ సీజన్ ప్రయాణ కష్టాలు, ఇంటర్ లాకింగ్ పనులతో ప్రత్యేక రైళ్లు రద్దు
Trains Cancellation: రైల్వే లైన్ల ఆధునీకీకరణ పనుల కారణంగా పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్ మొదలవుతున్న సమయంలో రైల్వే నిర్ణయంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేట్టు లేవు.
Trains Cancellation: పండుగల సీజన్ మొదలవుతున్న సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చే వార్తను ప్రకటించింది. ఇంటర్ లింకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు రైళ్లు రద్దు చేయడంతో దసరా ప్రయాణాలకు ఇక్కట్లు తప్పకపోవచ్చు. ప్రయాణికులకు ప్రత్యామ్నయ రవాణా మార్గానలు ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఇంటర్ లింకింగ్ కోసం సికింద్రాబాద్ మీదుగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారలు ప్రకటించారు. రద్దైన రైళ్లలో కాచిగూడ- నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచి (07593), మేడ్చల్ - లింగంపల్లి (47222), లింగంపల్లి - మేడ్చల్ (47225), మేడ్చల్-సికింద్రాబాద్ (47235), సికింద్రాబాద్-మేడ్చల్ (47236), మేడ్చల్- సికింద్రాబాద్ (47237), సికింద్రాబాద్-మేడ్చల్ (47238) మేడ్చల్-సికింద్రాబాద్(47242), సికింద్రాబాద్-మేడ్చల్ (47245), మేడ్చల్-సికింద్రాబాద్(47228), సికింద్రాబాద్-మేడ్చల్ (47229) రైళ్లు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి అదే నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులో ఉండవు. కాచిగూడ- మెదక్ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేశారు.
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి పండగల రద్దీ నేపధ్యలో కాచి గూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. కాచిగూడ-సికింద్రాబాద్( 07063) ఏడు సర్వీసులు, తిరుపతి-కాచిగూడ(07064) ఏడు సర్వీసులు, సికింద్రాబాద్-తిరుపతి (07011) 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్(07042) 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైళ్లు జనగామ, వరంగల్ మార్గంలో వెళ్తాయి. కాచిగూడ తిరుపతి రైళ్లు ఉందానగర్, షాద్ నగర్, మహబూబ్నగర్, గద్వాల మారంలో రాకపోకలు సాగిస్తాయి.
జీటీ మార్గంలో నాన్ ఇంటర్ లింకింగ్…
వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి మధ్య ఇటీవల రెండు బైపాస్ లైన్లను నిర్మించారు. అందుబాటులో ఉన్న రెండు అప్ అండ్ డౌన్ లైన్లు రైళ్ల రద్దీకి సరిపోక పోవడంతో అదనంగా రెండు బైపాస్ లైన్లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన లైన్లను పూర్తి స్థాయిలో మెయిన్ లైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో వాటిపై రైళ్లు నడపటం సాధ్యం కాకపోవడంతో ప్రధాన రైళ్లు కాకుండా మిగతా వాటిని రద్దు చేసి పనులు చేయిస్తున్నారు.
అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు ఈ పనులు జరిగేలా స్లాట్ కేటాయించారు. నెలాఖరు నుంచి దసరా ప్రత్యేక రైళ్లు నడపడం కోసం ప్రత్యేక రైళ్ల టైంటేబుల్ ఖరారు చేశారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న మార్గంలోనే ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఇప్పటికే 99 రైళ్లను రద్దు చేసి మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రద్దు చేసిన వాటిల్లో పండుగ ప్రత్యేక రైళ్లు 47 ఉన్నాయి. పండుగ ప్రయాణాలకు సిద్దమైన వారికి ఈ ఏడాది కష్టాలు తప్పకపోవచ్చు. ఏకంగా 47 రైళ్లు రద్దు కావడంతో ఆ ఎఫెక్ట్ ప్రయాణాలపై ఉండనుంది.
దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి దాదాపు 20 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. దూరప్రాంతాలకు వెళ్లేవారు రైళ్లనే నమ్ముకుంటున్నారు. పండుగ రద్దీలో కేవలం 30 శాతం మందిని మాత్రమే రైళ్లు తరలించగలుగుతున్నాయి. రైళ్ల రద్దీతో ఈ సారి ప్రయాణాలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఉంది.