Eluru Jail: ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహిళ బ్యారక్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. భర్తను హత్య చేసిన కేసులో మార్చి 24న నిందితురాలు అరెస్ట్ అయింది. ఈ కేసులో ఆమెతో పాటు మేనమామ సొంగ గోపాలరావుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ అదే రోజు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దీంతో ఆమెను ఏలూరు జిల్లా జైల్లోని మహిళ బ్యారక్‌లో ఉంచారు. ఆమె ఆరుగురితో కలిసి మహిళా బ్యారక్‌లో ఉంటుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారక్ ఓపెన్ చేయగా శాంతకుమారి బాత్ రూముకు వెళ్లి వస్తానని మిగిలిన ఖైదీలకు చెప్పి బ్యారక్‌లోకి వెళ్లింది. ఉదయం టిఫిన్ చేయడానికి ఎంత సేపటికి రాకపోవడంతో తోటీ ఖైదీలు వెళ్లి చూస్తే బ్యారక్ కిటికీకి చున్నీతో ఉరేసుకుని కనిపించింది.
వెంటనే జైలు సిబ్బందికి సమాచారం అందించారు. జైలు సిబ్బంది అధికారులకు సమాచారం అందించి, ఆమెను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్‌వీ స్వామి, ఏలూరు ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం జైలు అధికారుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. మృతిరాలి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో వారు ఏలూరు ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, జైలు అధికారుల సమక్షంలో ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ మృతదేహానికి ఆసుపత్రి మార్చురీలో పంచనామా నిర్వహించారు.
తమ కుమార్తెను ఈ కేసులో ఇరికించారని మృతిరాలి తల్లి బత్తుల కుమారి ఆరోపించారు. పోలీసుల బెదిరించారని, ఒత్తిడి చేశారని, అందువల్లనే నేరం చేసినట్లు అంగీకరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని కన్నీరుమున్నీరయ్యారు. మహిళ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎల్.వరలక్ష్మి (హెడ్ వార్డెన్), నాగమణి (వార్డెన్)లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో నిర్లక్ష్యంగా ఉన్నారనే వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్‌వీ స్వామి ఆదేశాలు ఇచ్చారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడేనికి చెందిన గంధం బోసుబాబు (34)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతకుమారికి 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భర్త బోసుబాబు సైతం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను తరచూ వేధించేవాడు. దీంతో భర్తను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించింది.
భర్తతో జీవించలేనని, వేధింపులు పెరిగాయని మేనమామ గోపాలరావుతో శాంతకుమారి చెప్పింది. దీంతో బోసుబాబును హత్య చేసేందుకు ప్రియుడు గోపాలరావు కూడా అంగీకరించాడు. ఈనెల 17న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బోసుబాబు తలపై గోపాలరావు ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 19న బోసుబాబు మృతి చెందాడు. భార్య శాంతకుమారి ఏమీ తెలియనట్లు భర్తతోనే ఆసుపత్రిలో ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.
ఈ కేసులో మృతుడి భార్యను పోలీసులు అనుమానించారు. ఆమెను విచారించడంతో కేసును ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 24న నిందితుడు గోపాలరావును అశ్వారావుపేటలో పోలీసులు అరెస్టు చేశారు. శాంతకుమారిని తాటియాకులగూడెంలో అరెస్టు చేశారు. అదే రోజు న్యాయస్థానం ముందు నిందితులను హాజరు పరిచారు. నిందితులిద్దరికీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వారిని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. సరిగ్గా వారంల్లోనే నిందితురాలు శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది.
(జగదీశ్వరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం