Eluru Crime : బాలుడిని చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి.. జంగారెడ్డిగూడెంలో దారుణం-father tortured a boy in jangareddygudem of eluru district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Crime : బాలుడిని చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి.. జంగారెడ్డిగూడెంలో దారుణం

Eluru Crime : బాలుడిని చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి.. జంగారెడ్డిగూడెంలో దారుణం

Basani Shiva Kumar HT Telugu
Feb 02, 2025 02:40 PM IST

Eluru Crime : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన జరిగింది. బాలుడిని చిత్రహింసలు పెట్టాడు మారు తండ్రి. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడంతో.. బాలుడి శరీరం కమిలిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు రాహుల్.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట.. అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మరిచి దాష్టీకం ప్రదర్శించడంతో.. ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ఏలూరు జిల్లా తాటిచర్లకు చెందిన శశి అనే మహిళ.. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది. ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుక ఉన్నారు.

ఏడాది కాలంగా సహజీవనం..

జంగారెడ్డిగూడేనికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాదికాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో కొట్టాడని బాలుడు బోరున విలపించాడు. బాలుడికి అయిన గాయాలను గుర్తించిన స్థానికులు.. ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు.

అమ్మనూ కొట్టేవాడు..

ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమె శరీరంపైనా కాలిన గాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు. తమను రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పిల్లలు వాపోయారు. తన తల్లిని కూడా కొట్టేవాడని బాలుడు చెప్పాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గాజువాకలో విషాదం..

విశాఖ జిల్లా గాజువాకలో విషాదం జరిగింది. భాస్కరరావు అనే వ్యక్తి అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేసింది. దీంతో భాస్కర రావును చితకబాది గదిలో బంధించారు యువతి కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులను పిలిపిస్తామని చెప్పడంతో.. భాస్కరరావు భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన కొడుకును చూసి.. తల్లిదండ్రులు రోధించారు.

నరకయాతన..

ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ లిఫ్టులో ఇరుక్కుపోయి.. 3 గంటలు నరకయాతన అనుభవించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోకపోవడంతో దాదాపు 3 గంటలు ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు. ప్రయాణికుల కేకలు విని పోలీసులు లిఫ్ట్ వద్దకు వచ్చారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో.. స్వయంగా రంగంలోకి దిగి పోలీసులు ప్రయాణికులను కాపాడారు.

Whats_app_banner