Kakinada News : కాకినాడలో దారుణం - పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని చంపేసిన కన్నతండ్రి…. ఆపై ఆత్మహత్య!-father kills two children and then commits suicide in kakinada district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada News : కాకినాడలో దారుణం - పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని చంపేసిన కన్నతండ్రి…. ఆపై ఆత్మహత్య!

Kakinada News : కాకినాడలో దారుణం - పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని చంపేసిన కన్నతండ్రి…. ఆపై ఆత్మహత్య!

HT Telugu Desk HT Telugu

పోటీ ప్రపంచంలో బతకలేరని కన్న పిల్లల్ని ఓ తండ్రి క్రూరంగా చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం (representative image ) (unsplash)

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపేసిన తండ్రి (ఓఎన్‌జీసీ ఉద్యోగి)… ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న క‌ట్టుకున్న భ‌ర్త‌ను… ప‌డి ఉన్న‌ క‌న్న‌పిల్ల‌లను చూసి ఇల్లాలు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌లు బాగా చ‌ద‌వటం లేద‌ని… పోటీ ప్ర‌పంచంలో పోటీ ప‌డ‌లేకపోతున్నార‌ంటూ రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది.

ఈ ఘ‌ట‌న కాకినాడ రూర‌ర్‌లోని తోట సుబ్బారావు న‌గ‌ర్‌లో శుక్ర‌వారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం చెందిన వాన‌ప‌ల్లి చంద్ర‌కిశోర్ కాకినాడలోని వాక‌ల‌పూడిలోని ఓఎన్‌జీసీ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. న‌గ‌రంలోని సుబ్బారావు న‌గ‌ర్‌లో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అత‌నికి భార్య త‌నూజ‌, పిల్ల‌లు జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. జోషిల్‌ ఒక‌టో త‌ర‌గ‌తి, నిఖిల్ యూకేజీ చ‌దువుతున్నాడు.

పిల్లలపై ఒత్తిడి…!

పిల్ల‌లు స‌రిగా చ‌ద‌వటం లేద‌ని కోపంతో ఉండేవాడు. దీంతో వారిని ఇటీవ‌లే స్కూల్‌ను కూడా మార్పించారు. అయిన‌ప్ప‌టికీ వారి చ‌దువులో పెద్ద‌గా మార్పేమీ క‌న‌బ‌డ‌లేదు. అయితే తండ్రిమాత్రం…. వారు అంద‌రికంటే బాగా చ‌ద‌వాలి. ఈ పోటీ ప్రపంచంలో రాణించాల‌ని బ‌లంగా కోరుకునేవాడు. అందుకోస‌మే స్కూల్‌ను కూడా మార్చాడు. పిల్ల‌లు బాగా చ‌ద‌వ‌టం లేద‌ని వారిపై ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో కుటుంబంలో స‌ర‌దాలు, సంతోషాలు లేకుండా పోయాయి.

బాగా చ‌ద‌వని పిల్లలు ఎందుకు అని..? వారిని లేకుండా చేయాలనే ఆలోచ‌న‌కు వ‌చ్చేంతా మాన‌సిక ప‌రిస్థితిల్లోకి తండ్రి వెళ్లిపోయాడు. అయితే హోలీ సంద‌ర్భంగా శుక్ర‌వారం చంద్ర‌కిశోర్ భార్య‌, పిల్ల‌ల‌ను తీసుకుని త‌మ కార్యాల‌యంలోని హోలీ వేడుక‌ల‌కు వెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ త‌న పిల్ల‌ల‌ను ఎలా చంపాల‌నే ఆలోచ‌న‌లోనే చంద్ర‌కిశోర్ ఉన్నాడు. ప‌ది నిమిషాల్లో వ‌చ్చేస్తాన‌ంటూ భార్యకి చెప్పిన చంద్రకిశోర్… బయటికి తీసుకెళ్లాడు. మరోవైపు భ‌ర్త‌, పిల్ల‌ల కోసం భార్య త‌నూజ ఓఎన్‌జీసీలోనే వేచి చూస్తుంది.

తాళ్లతో కట్టేసి… తలలు ముంచేసి…!

భ‌ర్త‌, పిల్ల‌లు ఎంత సేప‌టికీ రాక‌పోవ‌డంతో త‌నూజ ఫోన్ చేసింది. అయితే భ‌ర్త ఫోన్ తీయ‌లేదు. దీంతో భ‌ర్త తోటి ఓఎన్‌జీసీ ఉద్యోగుల‌తో క‌లిసి భార్య‌ ఇంటికి చేరుకుంది. కిటికీలోంచి చూస్తే….. భ‌ర్త ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉన్నాడు. దీంతో ఓఎన్‌జీసీ ఉద్యోగులు త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి ఓపెన్ చేసి చూసేస‌రికి పిల్ల‌లిద్ద‌రూ అక్క‌డే ప‌డిఉన్నారు. వారి కాళ్ల‌కూ చేతుల‌కు తాళ్ల‌తో క‌ట్టి నిండా నీళ్లు ఉన్న బ‌కెట్‌లో త‌లలు మునిగిపోయి ఉన్నాయి.

ఈ దృశ్యాల‌ను చూసి ఇల్లాలు త‌నూజ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ప్ర‌స్తుత పోటీ ప్రపంచంలో త‌న పిల్ల‌లు పోటీ ప‌డ‌లేకపోతున్నార‌ని… వారికి భ‌విష్య‌త్తు లేద‌ని, అందుకే ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తాను కూడా చ‌నిపోతున్నాన‌ని చంద్ర‌కిశోర్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఆ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు త‌ర‌లించారు. పోస్టుమార్టం అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు మృత‌దేహాల‌ను అప్ప‌గించారు. త‌న త‌మ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవ‌ని… ఆస్తులు ఉన్నాయ‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని చంద్ర‌కిశోర్ సోద‌రుడు వాపోయారు.

సంతోషంగా జీవిస్తున్న‌ కుటుంబంలో ఈ తీవ్ర విషాద ఘ‌ట‌నతో అంధ‌కారం చుట్టుముట్టింది. అల్లారిముద్దుగా పెంచుకున్న పిల్ల‌ల ప‌ట్ల తండ్రే కాల‌య‌ముడు అయ్యాడు. పోటీ ప్ర‌పంచం ఒక కుటుంబాన్ని వారికి తెలియకుండానే చిదిమేసినట్లు అయింది. ఈ ఘ‌ట‌న‌తో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆ ఇల్లాలి ప‌రిస్థితిని త‌లుచుకుంటూ స్థానికులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఆ ప్రాంత‌మంతా విషాదం ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. పండగ వేళ అంద‌రూ సంతోషంగా గ‌డుపుతుంటే…. ఆ కుటుంబం విషాదంలోకి నెట్ట‌బ‌డింది.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk