Anantapur Crime : అనంతపురం జిల్లాలో విషాదం - విద్యుత్ వైర్లు తెగిపడి తండ్రి, కొడుకు మృతి
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం దంతాలపల్లి గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రామాంజనేయులు.. రవి విద్యుత్ తీగలు తెగపడి మృతి చెందారు. రామాంజనేయులు, రవి కడప జిల్లా వెల్దండ మండలం అంకెనపల్లిలో ఉన్న తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం దంతాలపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకులకు షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే నేలపై పడి పోయి మృతి చెందారు. కుటుంబ పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబ విషాదంలో కూరుకుపోయింది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషాద ఘటనతో మడుగుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం తండ్రి, కొడుకుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేపు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకు ఎదుటే తండ్రి మృతి:
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కొడుకు ఎదుటే తండ్రి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం… పొన్నూరు డీవీసీ కాలనీకి చెందిన డ్రైవర్ బండారు శ్రీనివాసరావు (42) దోస్త్ వాహనంలో విజయవాడ నుంచి నూనె ప్యాకెట్లు లోడు చేసుకునేందుకు వెళ్లారు. కొడుకు రవితేజ విజయవాడలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాను విజయవాడ వచ్చానని, కాలేజీ సెలవు తీసుకుని వారధి వద్దకు రావాలని కొడుకుకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. నూనె ప్యాకెట్లు లోడు చేసుకుని వారధి వద్దకు వచ్చిన తండ్రి, అప్పటికే వేసి చూస్తోన్న కుమారుడిని ఎక్కించుకుని పొన్నూరు బయలు దేరారు.
మంగళవారం రాత్రి చేబ్రోలు, నారా కోడూరు గ్రామాల మధ్యకు వచ్చే సరికి పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు స్టీరింగ్ ముందు ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
పక్కనే కూర్చున్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌తో పాటు గుంటూరుకు చెందిన బాపిరెడ్డి, గురు బ్రహ్మాచారి, నారా కోడూరుకు చెందిన మదన్ మోహన్, మరో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.