ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం-fatal accident in prakasam district a travel bus collided with a tipper five people were burnt alive ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Parchurbus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

Sarath chandra.B HT Telugu

Parchur Bus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట- పర్చూరు జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఐదుగురు సంజీవ దహనం అయ్యారు.

ఈవూరివారిపాలెంలో మంటల్లో కాలిపోతున్న టిప్పర్, ట్రావెల్స్ బస్సు

Parchur Bus Accident: ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసి పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. ఎన్నికల్లో ఓటు వేసి తిరుగు ప్రయాణమైన వారిని క్షణాల్లో అగ్నికీలలు కమ్మేశాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు బంధువులతో కలిసి సొంతూరికి వచ్చిన వారంతా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. రెండ్రోజులు సొంతూరిలో గడిపి తిరిగి విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ బయల్దేరారు. ఊహించని విధంగా టిప్పర్‌ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.

ఓటు వేసి తిరుగు ప్రయాణమైన వారంతా మంటల్లో చిక్కుకుని విలవిలలాడారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్న వారిని మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది.

ఓట్ల పండుగ కోసం స్వస్థలాలకు వచ్చి తిరుగు ప్రయాణమైన కుటుంబాలను విధి వెక్కిరించింది. రెండ్రోజుల పాటు అంతా కలి సొంతూళ్లో గడిపి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలు దేరింది.

బస్సులో ఉన్న వారిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలు దాటాక చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి బస్సుకు ఎదురుగా వేగంగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్‌.. ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగాయి.. గం తీవ్రత దృష్ట్యా బస్సుకు కూడా మంటలు చుట్టుముట్టాయి.

ఈ ఘటనలో బస్సు డ్రైవరుతో పాటు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్న వారు కళ్లు తెరిచేలోపే.. అగ్నికీలలు చుట్టుముట్టాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదం జరిగిన స్పాట్‌లో, ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న నలుగురు మంటల్లో కాలిపోయారు. మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంమది. స్థానికులు ప్రమాద సమాచారాన్ని 108, పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు.

ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడటంతో చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడుల నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలానికి రప్పించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108లో చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

చిలకలూరిపేట నుంచి ఫైరింజన్ వచ్చిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. బైపాస్‌ రోడ్డు వర్క్‌ జరుగుతుండటంతో పాటు రోడ్డుపై మట్టి కుప్పలు ఉండటంతో టిప్పర్‌ డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేకపోయినట్టు చెబుతున్నారు.

సంబంధిత కథనం