Amaravati R5 Zone: పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఆపాలని హైకోర్టులో రైతుల పిటిషన్
Amaravati R5 Zone: అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించిన గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపును వ్యతిరేకిస్తూ రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. రాజధానిలో భూముల కేటాయింపు తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో అమరావతి రైతులు మరోమారు కోర్టును ఆశ్రయించారు.
Amaravati R5 Zone: రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూ బదలాయింపు చేయడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో రాజధాని ప్రాంత రైతు సంఘాల పిటిషన్ దాఖలు చేశారు.
రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, కలెక్టర్లకు భూ బదలాయింపు, సెంటు పట్టాల మంజూరును సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ రైతులు గతంలో కూడా హైకోర్టు,సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో 'నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు' పథకాన్ని అమలు చేయడం ఏపీసీఆర్‌డీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు 1134 ఎకరాలు బదలాయిస్తూ జారీచేసిన జీవో 45, మరో 268 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 59 నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు.
నీరుకొండ, కురగల్లు రైతుల సంక్షేమ సంఘం కార్యదర్శి శ్రీధర్‌బాబు, దొండపాడు, పిచికలపాలెం రైతుల సంక్షేమ సంఘం కార్యదర్శి డి.శంకరరావు, అబ్బరాజుపాలెం రైతుల సంక్షేమ సంఘం కార్యదర్శి కె.హరినాథ్ చౌదరి, రాయపూడి, కొండమరాజుపాలెం రైతుల సంక్షేమ సంఘం కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల రైతు సంక్షేమ సంఘాల కార్యదర్శులు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ అధ్యక్షుడు బసవయ్యల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు.
రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. జగనన్న ఇళ్లు పేరుతో ఆర్5 జోన్‌లో 21 లేఅవుట్లకు ఏపీ సీఆర్‌డీఏ ఆమోదం తెలపడం, ఏపీ భూ అభివృద్ధి, ఏపీ బిల్డింగ్ నిబంధనలు-2017కి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఒక్క సెంటు భూమి కేటాయింపుల కోసం ఆర్5 జోన్ ఏర్పాటు కోసం రాజధాని కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయడం వెనుక అధికార పార్టీకి దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని జగనన్న ఇళ్లు పేరుతో జరుగుతున్న పనులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించేలా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించాలన్నారు. తమకు సెంటు స్థలం కేటాయించాలని అభ్యర్థిస్తూ లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తులను కూడా కోర్టుకు సమర్పించేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి జగన్, పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ డిప్యూటీ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరోవైపు జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. అటు కేంద్రం కూడా ఈ ప్రాంతంలో 47వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించడానికి అమోదం తెలిపింది.