AP TG Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న రుతు పవనాలు, అనుకూల వాతావరణంతో రైతన్నల్లో ఉత్సాహం
AP TG Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉండటంతో రైతాంగం ఉత్సాహంగా ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.
AP TG Weather Updates: నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడంతో పాటు చురుగ్గా విస్తరిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి అనువైన వాతావరణం నెలకొంది.
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందని ప్రకటించారు. గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 47.5మిమీ, పెద్దాపురంలో 46.2మిమీ,తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 44.5మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 39.5మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 39మిమీ, రాజాంలో 37.7మిమీ, వేపాడలో 35.7మిమీ, తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడిలో 33.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో భారీ వర్షాలు…
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్ాయి.
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా పయనిస్తున్నాయిని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు.
నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం బుధవారం ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వివరించారు. వ్యవసాయానికి అనువైన వాతావరణం ఏర్పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనానికి రుతుపవనాలు ఉపశనమం కల్పిస్తున్నాయి.