Operation Garuda in AP : ఆపరేషన్ గరుడ.. మెడికల్ షాపుల నిర్వాహకుల గుండెల్లో దడ!-extensive inspections of medical shops across andhra pradesh as part of operation garuda ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Operation Garuda In Ap : ఆపరేషన్ గరుడ.. మెడికల్ షాపుల నిర్వాహకుల గుండెల్లో దడ!

Operation Garuda in AP : ఆపరేషన్ గరుడ.. మెడికల్ షాపుల నిర్వాహకుల గుండెల్లో దడ!

Operation Garuda in AP : రాష్ట్రంలో మందుల మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ గరుడ పేరుతో.. మెడికల్ మాఫియా గుండెల్లో దడ పుట్టిస్తోంది. శుక్రవారం ఏకకాలంలో 100కు పైగా బృందాలు తనిఖీలు చేపట్టాయి. పలు మెడికల్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

ఆపరేషన్ గరుడ (istockphoto)

ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు, విజయవాడల్లో విజిలెన్స్, ఈగల్, డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

నేరాలను అరికట్టడానికి..

కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా.. 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఇది ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెడుతుంది.

ప్రత్యేక కార్యక్రమం..

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వాడకం, అమ్మకం పెరగడం వల్ల యువత చెడిపోతున్నారు. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం "ఆపరేషన్ గరుడ" పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి, డ్రగ్స్ వాడేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపులలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ఇతర డ్రగ్స్ అమ్మడం వంటి వాటిపై దాడులు చేసి, తనిఖీలు చేస్తున్నారు.

చట్టప్రకారం నేరం..

వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం.. కొన్ని రకాల మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధం. ఇలాంటి మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే.. అమ్మిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, మందులు కొన్న వ్యక్తిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌తోనే..

ఈ చట్టం కింద, కొన్ని రకాల మందులు మాత్రమే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి అనుమతి ఉంది. వీటిని ఓవర్ ది కౌంటర్ మందులు అంటారు. ఈ మందులు సాధారణంగా జ్వరం, తలనొప్పి, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. అయితే, కొన్ని రకాల మందులు మాత్రం తప్పనిసరిగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తోనే కొనాలి. వీటిలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్, యాంటీడిప్రెసెంట్స్, యాంటీసైకోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్, హార్మోన్ థెరపీ మందులు మొదలైనవి ఉన్నాయి.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.