AP Employees Transfers : రిటైర్ అయ్యే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - బదిలీల నుంచి మినహాయింపు
మార్చి 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 76 విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
2025 మార్చి 31లోపు పదవీ విరమణ అయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారిని సాధారణ బదిలీల నుండి మినహాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 76తో కూడిన గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ గెజిట్‌ను విడుదల చేశారు.
అలాగే అన్ని డిపార్ట్‌మెంట్స్ హెచ్ఓడీలకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చిలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు సుమారు 8 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. బదిలీల నుండి ఈ ఉద్యోగులను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు మేలు కలుగుతోంది. అలాగే వారి వారి పెన్షన్ల ఫైల్స్ రెడీ చేసుకునేందుకు వీలు కలుగుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
బదిలీల ప్రక్రియ ఈనెల 31తో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంటా? అని ఆందోళనలో ఉన్న పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. సాధారణ బదిలీల నుంచి రిటైర్ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జాయింట్ కమిటీ, అమరావతి తరపున నాలుగు రోజుల ముందే ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని చేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసిన జెఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల (జీవో నెంబర్ 75ను 2024 ఆగస్టు 17) ఉత్తర్వుల్లో, మార్గదర్శకాలలో "సంవత్సరం లోపు పదవీ విరామం (రిటైర్) పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు" ఇవ్వలేదని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
62 ఏళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో (షుగర్, బీపీ, హార్ట్ పేషంట్స్ మొదలైన) ఉంటారని, అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా, వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్‌కు పంపాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
అలాగే గతంలో 2016వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు (జీవో నెంబర్ 102ను 2016 జున్ 10న) ఇచ్చిందని గుర్తు చేచేశారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులను రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులు సానుకూలంగా స్పందించి, ఒకటి, రెండు రోజుల్లో ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు.
అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించి వారి డిమాండ్‌ను అంగీకరించింది. 2025 మార్చి 31 తేదీ లోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సాధారణ బదిలీల నుండి మినహాయింపు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఉద్యోగుల్లో కాస్తా సంతోషం నెలకొంది.