Vijayasai Reddy : 'క్యారెక్టర్ ఉంది కాబట్టే అలా చేశా'..! జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదని స్పష్టం చేశారు. భయం అనేది తనలో ఏ అణువు అణువులోనూ లేదని ట్వీట్ చేశారు. నేతల రాజీనామాలపై నిన్న మాట్లాడిన జగన్.. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో చక్రం తిప్పిన చాలా మంది నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే జాబితాలోకి ఇటీవలే విజయసాయిరెడ్డి కూడా చేరిపోయారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
విజయసాయిరెడ్డి పార్టీ చేరకముందే…పలువురు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీని వీడారు. ఓవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నప్పటికీ… వైసీపీ నేతల రియాక్షన్ మరోలా ఉంటుంది. ఎంతమంది నేతలు బయటికి వెళ్లినా… పార్టీకి వచ్చే నష్టం ఏం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధినేత జగన్… కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీని వీడిన ఎంపీలు, నేతలను ఉద్దేశిస్తూ "పార్టీ నుంచి పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నాను. రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. క్యాడర్ కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలి. భయపడో, ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీపడి అటు వైపు వెళితే వారికి గౌరవం, క్యారెక్టర్ వాల్యూ ఏముంటుంది" అంటూ జగన్ మాట్లాడారు.
విజయసాయిరెడ్డి కౌంటర్…!
జగన్ ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే విజయ సాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత ఉన్నాయని చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని స్పష్టం చేశారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ట్వీట్ లో జగన్ పేరును మాత్రం విజయసాయిరెడ్డి ప్రస్తావించలేదు.
జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి స్పందించటం ఆసక్తికరంగా మారింది. ఓ రకంగా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. మరో మాజీ ఎంపీ మోపిదేవి కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రలోభాలకు లొంగే వ్యక్తినైతే జగన్ కేసుల్లో ఇరుక్కునే వాడినే కాదు కదా..? అంటూ కౌంటర్ ఇచ్చారు..!
సంబంధిత కథనం