వైసీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత విజయసాయిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పినప్పటికీ…. పొలిటికల్ రీఎంట్రీపై అనేక విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశిస్తూ…. ఆయన చుట్టూ కోటరీ చేరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందంటూ హితవు పలికిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తిరరమైన కథను పోస్ట్ చేశారు. ఇందులో కూడా ప్రధానంగా కోటరీ అనే విషయాన్ని ప్రస్తావించారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని… ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. లేకపోతే కోటనే ఉండదంటూ రాసుకొచ్చారు.
“పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు… తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ (X ఖాతా)లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వైసీపీనే ఉద్దేశించి చేశారా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
ఇటీవలే సీఐడీ విచారణ హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ చుట్టు చేరిన కోటరీ వల్లే ఆయనకు దూరమయ్యానని స్పష్టం చేశారు. జగన్ మనసులో తాను లేనని తెలిశాక మనసు విరిగిపోయిందని తెలిపారు. చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగానే… తాజాగా చేసిన ట్వీట్ లో కూడా కోటరీ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అటు వైసీపీతో పాటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సంబంధిత కథనం