Polavaram Height :పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే కుట్రలు చేస్తున్నారన్న కేవీపీ-ex mp kvp ramachandra rao expresses his doubt over reducing polavaram height to avoid land acquirement ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Mp Kvp Ramachandra Rao Expresses His Doubt Over Reducing Polavaram Height To Avoid Land Acquirement

Polavaram Height :పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే కుట్రలు చేస్తున్నారన్న కేవీపీ

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 01:54 PM IST

Polavaram కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్లే పోలవరం ప్రాజెక్టు అనాథలా మారిందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై ప్రధాని మోదీకి కేవీపీ లేఖరాశారు. కేంద్రం సవతి ప్రేమ చూపడం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని కేవీపీ ఆరోపణ
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని కేవీపీ ఆరోపణ

Polavaram కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపించడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ఎంపీ కే‌వి‌పి రామచంద్ర రావు లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు దుస్థితి ప్రధాని దృష్టికి తీసుకు రావడానికే లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం అనాధలా మిగిలిందని కేవీపీ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం చూపిస్తున సవితి తల్లి ప్రేమ వల్ల, నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రంలోకి వృధాగా పోయే 300పైగా టి‌ఎం‌సిల నీటిని వినియోగంలోకి తెచ్చే ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు ను అత్యంత ప్రజా ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రమే నిర్మించి, 2018 నాటికి పూర్తి చేయాలని విభజన చట్టం చెప్పిందనికేవీపీ గుర్తు చేశారు.

చంద్రబాబుతో ఒప్పందం ఏమిటి…?

పోలవరం ప్రాజెక్టులో మోదీకి, చంద్రబాబు కు ఏమి ఒప్పందం జరిగిందో తెలియదని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం వదులుకుందని ఆరోపించారు. 2018 నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో జ్యోతిష్కులు, చిలకజోస్యగాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. .

కాంట్రాక్టర్లు ఇంజనీర్లు చేయవలసిన పనిలో రాజకీయ జోక్యం వల్ల ప్రస్తుతం పోలవరం ప్రధాన డ్యామ్ పనులు మూడు ఏళ్ళుగా ఆగిపోయాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రధాన డ్యామ్‌కు పునాదిగా భావించే డయాఫ్రం వాల్ నిర్మాణము పూర్తి చేశామని జూన్ 2018 లోనే ప్రకటించిందని, 50 లక్షల క్యూసెక్కుల గోదావరి వరదలు తట్టుకునేలా ఈ డయాఫ్రం వాల్ నిర్మించవలసి ఉందని గుర్తు చేశారు.

20 లక్షల క్యూసెక్కులతో వచ్చిన వరదలకే డయాఫ్రం వాల్ కొంత భాగం దెబ్బతిని కొంత భాగం కొట్టుకుపోయినట్టుగా అధికారులు చెబుతున్నారని, డయాఫ్రం వాల్ మీదే పోలవరం ప్రధాన డ్యామ్ కట్టి, కట్టిన తర్వాత అది కొట్టుకుపోయి ఉంటే జరిగే నష్టాన్ని ఊహించడానికే భయంకరంగా ఉందన్నారు.డయాఫ్రం వాల్ కు నష్టం జరగడానికి మానవ తప్పిదమే కారణమని, డయాఫ్రం వాల్‌కు నష్టం జరగడానికి కారణమైన సాంకేతిక కారణాలను గుర్తించకుండా గత ప్రభుత్వ పెద్దలు, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని కేవీపీ ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి కారణం ఎవరో కమిటీ వేసి ఎంక్వయిరీ చేసి నిర్ధారించకుండా పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు టీవీల్లో డైలీ సీరియల్స్ ను తలపిస్తున్నాయన్నారు. తప్పిదానికి కారణం ఎవరో ప్రకటించవలసిన కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తున్నాయన్నారు. ఈ డయాఫ్రం వాల్ పని నాణ్యత మీద కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయని కేవీపీ సందేహం వ్యక్తం చేశారు.

పోలవరం ఎత్తు తగ్గింపుపై అనుమానాలు…..

పోలవరం పూర్తి రిజర్వాయర్ లెవల్ ను 150 అడుగుల నుంచి 140 అడుగులకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడాన్ని కేవీపీ ప్రశ్నించారు. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల కంటే తక్కువగా ఉంటే పోలవరం ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యం అని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పిందని గుర్తు చేశారు. భూసేకరణకు, పునరావాస- పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నిధులు వెచ్చించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు మరియు 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు 30 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.

ఈ ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు కుదించవలసిందిగా రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు పోలవరాన్ని పోలవరం రిజర్వాయర్‌ను 150 అడుగుల ఎత్తుకు కట్టకపోతే ఈ పోలవరం నిర్మాణం కేవలం ఒక కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుందన్నారు. ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్ గా నీళ్లు నిలువ చేయలేదని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై ఖర్చుపెట్టిన 20వేల కోట్ల ప్రజాధనం కూడా వృధా అవుతుందని హెచ్చరించారు.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ హైదరాబాదును కోల్పోవడం వల్ల , లోటు బడ్జెట్ గల రాష్ట్రంగా ఏర్పడడం వల్ల ఆ రాష్ట్రానికి జరిగిన ఆర్ధిక నష్టాన్ని పూడ్చడానికే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీతో పాటు, పోలవరం పూర్తి నిర్మాణ ఖర్చు బాధ్యతను కేంద్రానికి అప్పచెబుతూ పార్లమెంటు చట్టం చేసిందని కేవీపీగుర్తు చేశారు. విభజన చట్టాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు కేంద్రం పోలవరం ఖర్చు బాధ్యతలను రాష్ట్రం నెత్తిపై వేయటం చట్టానికి పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకమన్నారు.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం జాతీయ ప్రాజెక్టును ఫుల్ రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల మేరకు రాష్ట్రంపై భారం లేకుండా పూర్తి కేంద్ర నిధులతో త్వరితగతిన నిర్మించి పూర్తి చేయాలని కేంద్ర జలవనురుల శాఖను, పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని ప్రధానిని కేవీపీ కోరారు.

***

IPL_Entry_Point