ముగిసిన తోపుదుర్తి విచారణ.. 102 ప్రశ్నలు అడిగిన పోలీసులు.. తనకు సంబంధం లేదన్న ప్రకాష్‌రెడ్డి-ex mla thopudurthi prakash reddy appears before police for questioning ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ముగిసిన తోపుదుర్తి విచారణ.. 102 ప్రశ్నలు అడిగిన పోలీసులు.. తనకు సంబంధం లేదన్న ప్రకాష్‌రెడ్డి

ముగిసిన తోపుదుర్తి విచారణ.. 102 ప్రశ్నలు అడిగిన పోలీసులు.. తనకు సంబంధం లేదన్న ప్రకాష్‌రెడ్డి

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్ పగిలిన ఘటనపై పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. 102 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే.. హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్ పగిలిన ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

మీడియాతో మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. సీకేపల్లి పోలీస్ స్టేషన్‌లో 3 గంటలకుపైగా పోలీసులు ప్రశ్నించారు. విచారణలో పోలీసులు 102 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్ పగిలిన ఘటనకు తనకు సంబంధం లేదని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

నేనే కంట్రోల్ చేశా..

'హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ పర్మిషన్‌ నేను తీసుకోలేదు. హెలిపాడ్‌ వైపు వెళ్లొద్దని కార్యకర్తలను సముదాయించా. పోలీసులు చెప్పడంతోనే కార్యకర్తలను కంట్రోల్‌ చేశా. జగన్‌ పాపిరెడ్డిపల్లి పర్యటనకు.. పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. పోలీసుల భద్రతా వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే.. మాపై కేసులు నమోదు చేశారు' అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

రామగిరి సీఐ ఏమన్నారు..

'జగన్‌ హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలిన కేసులో.. మరికొంత మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది. అవసరమైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మరోసారి విచారణకు పిలుస్తాం. ఇప్పటికే హెలికాప్టర్‌ కోపైలట్‌ను విచారించాం. పైలట్‌ అనిల్‌ రేపు విచారణకు హాజరవుతారు' అని రామగిరి సీఐ వివరించారు.

నేపథ్యం ఏంటి..

వైసీపీ చీఫ్ జగన్ ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్‌ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు హెలికాప్టర్‌పై పడ్డారు. దీంతో జగన్ వచ్చిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. హెలికాప్టర్ డ్యామేజీ కావటంతో దాంట్లో బెంగళూరుకు వెళ్లడం ప్రమాదమని పైలెట్లు జగన్‌కు సూచించారు. ఆయన రాప్తాడు నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లారు.

వైసీపీ ఆరోపణలు..

జగన్ రామగిరి పర్యటనలో భద్రతా లోపం కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపించారు. కార్యకర్తలు, జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లేకుండా పోయారని మండిపడ్డారు. జగన్ రాప్తాడు పర్యటనలో తగినంత పోలీస్ సిబ్బందిని కేటాయించలేదని.. హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

తోపుదుర్తిపై ఆరోపణలు..

ఈ వ్యవహారంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఆయన కారణంగానే హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్ పగిలినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అయన్ను పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ప్రకాష్ రెడ్డి ప్రజలను కంట్రోల్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనం