Lokesh Deputy CM : లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా-టీడీపీ నుంచి పెరుగుతోన్న డిమాండ్
Lokesh Deputy CM : నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనకు మాజీ మంత్రి సోమిరెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు.
Lokesh Deputy CM : మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ కీలక నేతలు లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి...లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి నారా లోకేశ్ వంద శాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. లోకేశ్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను"- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబును ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి కోరారు. నిన్న మైదుకూరు సభలో శ్రీనివాసరెడ్డి...సీఎం చంద్రబాబు సభావేదికపై ఉండగానే ఈ ప్రతిపాదన చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేశ్ అలుపెరగని సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. కార్యకర్తల సంక్షేమం లోకేశ్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి 42 ఏళ్లు అయిందని, ఇప్పుడు మూడోతరం నడుస్తోందన్నారు. భవిష్యత్తు కోసం, పార్టీని నమ్ముకున్న యువత కోసం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీంతో యువతరానికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనకు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా మద్దతు తెలిపారు.
కూటమిలో సైలెంట్ వార్?
ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. జట్టుకట్టిన కూటమి పార్టీల మధ్య ఏ క్షణాన అగ్గి రాజుకుంటుందోనని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా ప్రతిపాదన తెరపైకి రావడంతో....పవన్ కు చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఒక్కరే అనే ప్రతిపాదిన కూటమి పార్టీల మధ్య ఏంలేదని టీడీపీ మద్దతుదారులు అంటున్నారు. లోకేశ్ ను సీఎంగా చూడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అందులో భాగంగా ముందు డిప్యూటీ సీఎం, ఆ తర్వాత సీఎంగా లోకేశ్ కు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. అయితే జనసేన మద్దతుదారులు కూడా పవన్ కల్యాణ్ సీఎంగా చూడాలని కోరుకుంటున్నాయి. అయితే కూటమిలో చీలిక వస్తే జగన్ పాచికపారినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదాపై పవన్ కల్యాణ్, జనసేన ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే అంటున్నారు.
సంబంధిత కథనం