AP Politics : వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా - అదేబాటలో మరికొందరు నేతలు...!
AP Politics : ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించటంతో రాజకీయ పరిణామాలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల తర్వాత మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు… వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు కూడా ఉన్నారని తెలుస్తోంది.

AP Politics : రాష్ట్రంలో ఘోర పరాజయం తరువాత వైసీపీకి గడ్డు రోజులు రానున్నాయి. ఒకపక్క టీడీపీ దాడులు, మరోపక్క పార్టీ నుంచి నేత నిష్క్రమణతో సతమతమయ్యే రోజులు రానున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే వైసీపీ కార్యాలయాలు, వైసీపీ నేతల ఇళ్లపై దాడులు పరంపర కొనసాగుతుంది. దీనిపై వైసీపీ నేతల బృందం కూడా గవర్నర్ ను కలిసి విన్నవించింది.
ఈ దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. అలాగే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీ కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలు కాపాడాలని పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు.
మాజీ మంత్రి రావెల రాజీనామా…!
ఇదిలా ఉండగా వైసీపీ ఫస్ట్ వికెట్ పడింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. ప్రజాసేవ చేయడానికి గతంలో టీడీపీ అధినేత అద్బుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన నాయకత్వంలో పని చేశానన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధ పడుతూనే ఉంటానన్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని భ్రమించి అందులో చేరానని, కానీ ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. సంక్షేమ, సమగ్ర రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారని అన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు అన్నారు. ఓ పక్క సమాజసేవ చేస్తుఇనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.
రావెల కిశోర్ బాబు బ్యూరోక్రట్. పదవి వదిలి 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. 2019లో టీడిపీ ఓడిపోవడంతో వైసీపీలో చేరారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏపీ వ్యవహారాలను కొద్ది రోజులు చూశారు. అంతలో మళ్లీ వైసీపీకి వచ్చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. దాంతో కిశోర్ బాబు వైసీపీ రాజీనామా చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి అశోక్ రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కోనసీమ జిల్లా అధ్యక్షులు పొన్నడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డిలకు రాజీనామా లేఖలు పంపారు.
మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు కూడా ఆ పార్టీని వీడుతారని చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే వైసీపీకి బిగ్ షాకే అవుతుంది. మరోవైపు తాను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్టి, ధనుంజయ రెడ్టిల వల్లే ఆ పార్టీలో ఇమడలేకపోయానని మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు.