Perni Nani : రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ఏటా పవన్ కే దక్కుతుంది... పేర్ని నాని-ex minister perni nani slams janasena chief pawan kalyan for his statements on kapu unity ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Minister Perni Nani Slams Janasena Chief Pawan Kalyan For His Statements On Kapu Unity

Perni Nani : రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ఏటా పవన్ కే దక్కుతుంది... పేర్ని నాని

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 09:18 PM IST

Perni Nani : జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో ఏ రాజకీయ నాయకుడూ ఎన్నికల్లో గెలవలేరని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ని కాపులు గుండెల్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ మాటి మాటికీ కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాపుల కోసం పవన్‌ ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కులాలపైనా పవన్‌కు కనీస అవగాహన లేదని.. రాజకీయాల్లో ఆస్కార్‌ ఉంటే.. ఏటా పవన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిలో జనసేన అధినేత అన్ని రంగులు బయటపడతాయని నాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ని కాపులు గుండెల్లో పెట్టుకున్నారన్న ఆయన... అధికారం చేపట్టిన మూడేళ్లలోనే కాపుల సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2024, 2029 లోనూ కాపులు జగన్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

తన కులంవాళ్లు ఓటేస్తే తాను ఓడిపోయేవాడినే కాదని పవన్‌ అంటున్నారని.. అసలు రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు.... పేర్ని నాని. ఒక్క కులం ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా ? అని నిలదీశారు. ఒకే ఒక్క కులం ఓట్లతో నాయకులవుతారు కానీ.... ప్రజా నేత కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్‌ కల్యాణ్‌ అంతిమ లక్ష్యమని పేర్ని నాని విమర్శించారు. కమ్మ కులం కోసం కాపు కులం ప్రతినిధులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆడించినట్లే పవన్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు టోపీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

లోపాయికారీ ఒప్పందాలకు పవన్‌ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు. 2014 నుంచి 2023 వరకు పవన్‌ కళ్యాణ్‌ చరిత్ర, జనసేన బండారంపై కూర్చొని చర్చిద్దామా అని సవాల్ విసిరారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్‌ పోటీపడుతున్నారని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని... చంద్రబాబు ప్రాపకం కోసమే ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పవన్ సోషల్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని.. ఏ కులం ఏ జాబితాలో ఉందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. ఏటా డిసెంబరులో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతిని ప్రజలంతా ఎంత సంబరంగా జరుపుకుంటారో.. అదే విధంగా తన పార్టీ ఆవిర్భావం కూడా సినిమా ఫంక్షన్‌ తంతుగా జరుపుకుంటున్నారని సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ కు అసలు సిద్దాంతాలే లేవని.. నిలకడ లేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జనసేన అని ఎద్దేవా చేశారు.

IPL_Entry_Point