Perni Nani : నీ కుర్చీ పీకారు కదా..! బండి సంజయ్‌ టార్గెట్‍గా పేర్ని నాని సెటైర్లు-ex minister perni nani comments on bandi sanjay and chandrabbu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Perni Nani : నీ కుర్చీ పీకారు కదా..! బండి సంజయ్‌ టార్గెట్‍గా పేర్ని నాని సెటైర్లు

Perni Nani : నీ కుర్చీ పీకారు కదా..! బండి సంజయ్‌ టార్గెట్‍గా పేర్ని నాని సెటైర్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 05, 2023 09:26 PM IST

EX Minister Perni Nani : టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జాబితాలో దొంగ ఓట్లు చేర్చారని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమన్నారు. చంద్రబాబు కోసం తెలంగాణకు చెందిన బండి సంజయ్ కూడా పని చేస్తున్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని

EX Minister Perni Nani On Voters List: రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి (సీఈఓ)ని కలిసి, ఓటర్ల జాబితాల్లో ఉన్న అవకతవకలను వివరించామని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. చాలా చోట్ల డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్‌ ఐడీతో చాలా ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

గత 15 రోజులుగా కొన్ని ఎల్లో మీడియా ఛానెల్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారని... అందుకు బదులిచ్చే విషయమైన ఇవాళ అన్ని వివరాలను, లోపాలను, ఓటర్ల జాబితాల్లో ఉన్న అవకతవకలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారికి చెప్పామని తెలిపారు.

" 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉంది? అన్నవి చూపాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో.. ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. ఆ విధంగా 59,18,631 ఓట్లు ఉన్నాయని 2019కి ముందే మా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితా చూస్తే.. పేరులో, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు, మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఆంధ్రలో రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు దాదాపు 16.59 లక్షలు ఉన్నారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఓటర్ల జాబితాను సవరించాలని రాష్ట్ర సీఈఓను కోరాం" అని పేర్ని నాని పేర్కొన్నారు.

ఆధార్‌తో లింక్‌ చేయాలి…

ప్రతి ఓటర్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశామన్నారు పేర్ని నాని. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఈఓ, విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోతామన్నారు. ప్రకాశం, కృష్ణా జిల్లాలో అలా రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి వివరాలు జాబితాల్లో చూపామని వెల్లడించారు. 2019 ఓటర్ల జాబితాలోనే అనేక తప్పులు ఉన్నాయని... నిజానికి ఆరోజు కూడా మేము ఆ ఓట్లపై చర్యలు తీసుకోమని కోరినా, అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఒకే డోర్‌ నెంబరులో 500 ఓట్లు ఉన్నాయంటూ తమని నిందించటం సరికాదన్నారు. పాపాలు చేసింది వారని... అలాంటి వ్యక్తులే ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారని చెప్పారు.

“2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. మేము ఆ లోపాలు సవరించమని కోరుతున్నాం. ఇలా దొంగ ఓట్లు చేర్చడం, అవతల పార్టీ వారి ఓట్లు తీసేయడం వంటివి చంద్రబాబుకే అలవాటు. ప్రజల నుంచి కాకుండా, తప్పుడు మార్గాల్లో గెలవాలని చూడడం చంద్రబాబుకు పద్ధతి. తెలంగాణ నుంచి వచ్చిన బండి సంజయ్ కూడా ఇక్కడ ఓటర్ల జాబితాపై మాట్లాడుతుండు. వైసీపీ అక్రమంగా ఓట్లను చేర్చుతుందంటూ ఆరోపించారు. "పైన దేవుడు పీకితే, కింద బీజేపీ కుర్చీ పీకేసింది. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడమేందుకు..? ఓ పార్టీలో ఉంటూ... మరో పార్టీ గొంతు వినిపించడమేంటి..? అంటూ సంజయ్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు.

"తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. అంటే 2015, జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో, అంటే 2016 లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఆ విధంగా కేవలం మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. సేవామిత్ర అనే యాప్‌ను వాడి, మా పార్టీ సానుభూతిపరులను గుర్తించి, వారందరినీ తొలగించారు. దానిపై మేము పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి, ఆ ఓట్లు తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం" అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

WhatsApp channel