Kannababu : ఎమ్మెల్యేలను కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి… చంద్రబాబుకు కన్నబాబు ప్రశ్న-ex minister kanna babu challenge for debate to tdp president chandra babu on his letter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Minister Kanna Babu Challenge For Debate To Tdp President Chandra Babu On His Letter

Kannababu : ఎమ్మెల్యేలను కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి… చంద్రబాబుకు కన్నబాబు ప్రశ్న

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 07:34 PM IST

Kannababu చంద్రబాబుకు అధికారంలో ఉంటే స్వజన ప్రయోజనాలు, విపక్షంలో ఉంటే రాజ్యాంగ పరిరక్షణ గుర్తొస్తాయని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎవరు నిర్వీర్యం చేశారో చర్చించడానికి సిద్ధమా అని నిలదీశారు. ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అవుతుందని ప్రశ్నించారు.

మాజీ మంత్రి కురసాల కన్నబాబు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు

Kannababu అధికారంలో లేనప్పుడే బాబుకు రాజ్యాంగం గుర్తొస్తుందని మాజీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహిస్తూ రాజ్యాంగ రూపశిల్పి, మహనీయుడు అంబేద్కర్‌‌ను స్మరించుకున్నామని రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందిస్తామని ప్రతిజ్ఞ చేయడం మన విధిగా భావిస్తే , కొంత మంది తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం ఈరోజును కూడా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతి దాన్ని రాజకీయంగా చూసే వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబునాయుడని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబు నాయుడు తానో గొప్ప రాజ్యాంగ ప్రేమికుడిలా ఓ ప్రేమ లేఖను ప్రజలకు రాశారని, ఆ లేఖ నిండా శ్రీ జగన్‌ గారిపై శాపనార్ధాలు..ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ఉన్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత అచ్చు గుద్దినట్లు చంద్రబాబునాయుడికి సరిపోతుందన్నారు. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడిన ఈ పెద్ద మనిషికి అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తుకు వస్తుందని, అధికారంలో లేనప్పుడు ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకు వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం స్వజన ప్రయోజనాలు మాత్రమే గుర్తుకు ఉంటాయి. తనవారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏదైనా చేస్తాడన్నారు.

ఈ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేసింది ఎవరనే అంశంపై చర్చకు వస్తావా చంద్రబాబు అని సవాలు చేశారు. గత మూడున్నరేళ్ళుగా అంబేద్కర్ ఆశయ సాధన దిశగా పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి గొప్పగా మాట్లాడుతున్న చంద్రబాబు హయంలో ఏం చేశారో మేం చెబుతామని, చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. అబద్దాలను అలవోకగా, దుర్మార్గంగా సొంత బాకాలతో ప్రచారం చేసి, లేనిది ఉన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు పడ్డ తపన ప్రజల కోసం మాత్రం కాదన్నారు.

ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి బాబూ..?

ఎన్టీఆర్‌ ను కూలదోసి క్యాంపు రాజకీయాలు నడపడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా అని ప్రశ్నించిన కన్నబాబు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అనేది చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతి రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి.. ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీకి తిలోదకాలు ఇచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, 4,500 ఎకరాలను ఏవిధంగా సంపాదించుకున్నారో సీఐడీ స్పష్టంగా చెప్పిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘం కూడా అదే తేల్చిందని, దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలు ఈ దేశానికి ఆయన ఇచ్చిన సందేశమా అనేది జవాబు చెప్పాలన్నరు.

వీడేం ఖర్మ రాష్ట్రానికి...!

ఇంగ్లీష్‌ బాష నేర్చుకుంటే పులి పాలు తాగినట్లు అని అంబేద్కర్‌ గారు ఆనాడే చెప్పారు. అలాంటి ఇంగ్లీష్‌ మీడియం విద్యను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడితే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో కొంత మంది పేదలకు భూములు ఇస్తామంటే.. వారికి నిలువ నీడ ఉండకూడదని, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టులకు వెళ్లింది మర్చిపోయారా అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఉత్తరాలు రాస్తున్నాడని, వీడేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనుకోబట్టే ప్రజలు 2019లో సరైన తీర్పు ఇచ్చారన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయాడన్నారు. ప్రజల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఇదేం ఖర్మ తెలుగుదేశానికి అని చంద్రబాబు భావిస్తున్నాడు. గతంలో మాదిరిగా చంద్రబాబు చెప్పినవన్నీ వినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

IPL_Entry_Point

టాపిక్