Balineni Srinivasa Reddy : వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా - జనసేనలో చేరేందుకు రెడీ..!-ex minister balineni srinivasa reddy resigned to ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Srinivasa Reddy : వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా - జనసేనలో చేరేందుకు రెడీ..!

Balineni Srinivasa Reddy : వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా - జనసేనలో చేరేందుకు రెడీ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 05:30 PM IST

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేర‌కు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు. కొద్దిరోజులుగా వైసీపీ అధినాయకత్వంపై బాలినేని అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.

 వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. కొన్ని కారణాల రీత్యా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు.

రాజకీయాలు వేరు.. బంధుత్వాలు వేరని తన రాజీనామా లేఖలో బాలినేని పేర్కొన్నారు. జగన్‌ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానని ప్రస్తావించారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలన్న ఆయన… రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సాయం చేశానని చెప్పారు. అంతిమంగా ప్రజల తీర్పు శిరోధార్యం రాని రాసుకొచ్చారు.

ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు కూడా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే చర్చ మళ్లీ జోరందుకుంది.

ఈ క్రమంలోనే గత వారం పార్టీ అధినేత జగన్మోహ్ రెడ్డి నుంచి బాలినేనికి పిలుపు వచ్చింది. జగన్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. తాను పార్టీలో ఉండలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో జగన్‌తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్‌కు బంధువు. వైవీ సుబ్బారెడ్డికి స్వయాన బావ అవుతారు. ఆయన వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.

జనసేనలోకి బాలినేని…!

బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరతారనే తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా పూర్తైనట్లు సమాచారం. రేపు పవన్ తో భేటీ కానున్నట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్‌తోనూ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్.. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయలేదు. కొన్ని సందర్భాల్లో పవన్‌కు సపోర్ట్‌గా నిలిచారనే టాక్ కూడా ఉంది. అటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో బాలినేనికి రాజకీయ వైరం ఉంది. దీంతో బాలినేని జనసేనలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

జగన్ కేబినెట్ లో మంత్రిగా…

2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తొలి మంత్రివర్గంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కింది. విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు. అటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్లను జగన్ మంత్రి వర్గంలో కొనసాగించారు. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మళ్లీ అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆయన తన అనుచరులను ఎమ్మెల్యేగా గెలిపించుకునే సత్తా ఉన్న నేత. అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తి కూడా ఉంది. తాను కాకుండా వేరే వాళ్లు చెప్పిన వారికి టికెట్ ఇవ్వడంతో బాలినేని బహిరంగంగానే అంసతృప్తి వ్యక్తం చేశారు. అటు జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి తోనూ బాలినేనికి పొసగడం లేదని సమాచారం. ఇవన్నీ కారణాలతో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతుండటంతో వైసీపీలో ఏం జరుగుతుందనేది అర్థం కావటం లేదు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు కూడా పార్టీని వీడారు. ఇదే బాటలో తాజాగా బాలినేని కూడా రాజీనామా చేయటంతో ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. బాలినేని రాజీనామా పరిణామంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.