Telugu News  /  Andhra Pradesh  /  Ex Home Minister Vasantha Nageswara Rao Sensational Comments On Ap Cm Jagan Mohan Reddy
మాజీ హోమంత్రి వసంత నాగేశ్వరరావు (ఫైల్)
మాజీ హోమంత్రి వసంత నాగేశ్వరరావు (ఫైల్)

Vasantha Nageswara rao : క్యాబినెట్‌లో కమ్మవారికి ప్రాతినిధ్యం ఏది…?

22 November 2022, 6:57 ISTHT Telugu Desk
22 November 2022, 6:57 IST

Vasantha Nageswara rao ఏపీ క్యాబినెట్‌ విస్తరణ జరిగి దాదాపు ఆర్నెల్లు కావొస్తున్న, మంత్రి వర్గ కూర్పుపై రేగిన చిచ్చు మాత్రం చల్లారడం లేదు. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తండ్రి ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బహిరంగంగా విమర్శలకు దిగారు. ఏపీ క్యాబినెట్‌లో కమ్మ కులానికి ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు విమర్శించారు.

Vasantha Nageswara rao ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై కమ్మ సామాజిక వర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉందనేది నిర్వివాదాంశం. ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకులు ఎవరు ఈ విషయంలో బయటపడకపోయినా తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గొంతు విప్పారు. ఆయన తనయుడు వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై వసంత నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మ వర్గానికి సిఎం జగన్ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల పైన స్పందించారు. ఏపీ కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటని ప్రశ్నించారు.

గుంటూరు-విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని వసంత అభిప్రాయపడ్డారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల నుంచి 32 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని కోసం రైతులు తమ భూముల్ని త్యాగం చేశారని చెప్పారు. విజయవాడలో రైల్వే జంక్షన్, విమానాశ్రయం, కృష్ణా నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేక నిర్మాణాలు ఉన్నాయని, కానీ, ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలో కమ్మ వర్గం పైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్దం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల వారి పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు మారితేనే భవిష్యత్ తరాలు రాజకీయాల్లోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో కంటే పక్క రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంపై కూడా వసంత తప్పు పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు ఇలా పేర్లు మార్చే పనులు చేయలేదన్నారు. పేర్లు మార్చడం వల్ల ఓ వర్గాన్ని అకారణంగా దూరం పెడుతున్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. రాజశేఖర్‌ రెడ్డి తనయుడిని కమ్మ సామాజిక వర్గంలో దాదాపు 35శాతం మంది ఓటర్లు ఆదరించారని, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత సిఎంపై ఉందని వసంత చెప్పారు. 2004 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల్లో తాను ఓడిపోయినా ఆప్కాబ్ ఛైర్మన్‌గా వైఎస్సార్ నియమించారని, అన్ని వర్గాలను వైఎస్ గౌరవించే వారని చెప్పారు. అప్పట్లో ఇద్దరికి కమ్మ సామాజిక వర్గం నుంచి వైఎస్ మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

తెలంగాణలో కమ్మ మంత్రి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో తెలంగాణ మంత్రులు ఉన్నాి..ఏపీలో లేకపోవటం విచారకరమని వ్యాఖ్యానించారు. వసంత నాగేశ్వర రావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం జగన్ తన తొలి కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ ఏడాది జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కొడాలి నానిని తప్పించారు. కమ్మ వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు.

వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఏపి క్యాబినెట్‌లో కమ్మ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై అంతర్గత చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. కొడాలి నానికి రాష్ట్ర స్థాయిలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని భావించినా దానిని స్వీకరించేందుకు కొడాలి నాని అంగీకరించలేదు. మంత్రి పదవి పోయినందుకు ఈ పదవి ఇచ్చారనే అభిప్రాయం కలుగుతుందని, తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని కొడాలి స్పష్టం చేసారు. ఆ తరువాత ఇతర అగ్ర కులాలతో పాటుగా కమ్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేాశారు. ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం.. చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆ వివాదం ముగిసినా దానిని వసంత రాజేసే ప్రయత్నాలు చేస్తుండటం దేనికోసమనే చర్చ మొదలైంది.

మరోవైపు తండ్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వివరణ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. వసంత కుటుంబం పార్టీ వీడుతారని ప్రచారం జరగడంతో ఆయన వివరణ ఇచ్చారు.

టాపిక్