YS Jagan: అది చంద్రబాబు వ్యవస్థీకృత నేరం.. అప్పురత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్-ex cm ys jagan criticises budget chandrababu organised crime challenges arrest him ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan: అది చంద్రబాబు వ్యవస్థీకృత నేరం.. అప్పురత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్

YS Jagan: అది చంద్రబాబు వ్యవస్థీకృత నేరం.. అప్పురత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్

Bandaru Satyaprasad HT Telugu
Nov 14, 2024 05:18 AM IST

YS Jagan: కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైఎస్ జగన్ విమర్శించారు. బడ్జెట్‌ చూస్తే చంద్రబాబు చేసే వ్యవస్థీకృత నేరం తెలుస్తుందన్నారు. వైసీపీ హయాంలో ఏపీ అప్పులు రూ. 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారన్నారు.

బడ్జెట్ చంద్రబాబు ఆర్గ్ నైజ్డ్ క్రైమ్, అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్
బడ్జెట్ చంద్రబాబు ఆర్గ్ నైజ్డ్ క్రైమ్, అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పత్రాలు సీఎం చంద్రబాబు డ్రామా ఆర్టిస్టు అని రుజువు చేశాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓ వర్గం మీడియాతో అబద్ధాలు రాయిస్తున్నారని, అదే విషయాన్ని పదే పదే మాట్లాడతారన్నారు. అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుందనే దుష్ప్రచారాన్ని చేశారని ఆరోపించారు.

మభ్యపెట్టే బడ్జెట్

కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైఎస్ జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టలేదని ప్రశ్నించారు. బడ్జెట్‌ పెడితే కూటమి సర్కార్ మోసాలు బయటపడతాయనే ఇంతకాలం బడ్జెట్‌ పెట్టకుండా సాగదీశారన్నారు. చంద్రబాబు సృష్టించిన అబద్దాన్ని ఓ వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.

అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక దాటిపోయిందని దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఈ విషయాలను దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో మాట్లాడిస్తారన్నారు. ఇదంతా వ్యవస్థీకృత నేరానికి నిలువెత్తు నిదర్శనం అని విమర్శించారు.

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ కూటమి పాలన సాగుతుందని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చారని, 147 మందిపై కేసులు పెట్టి 49 మందిని అరెస్ట్ చేశారన్నారు.

అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. కానీ బడ్జెట్ లో ఇవేవీ కనిపించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చామన్నారు.

58 వేల ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వంలోని ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికీ కూటమి సర్కార్ రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున రూ.13 వేల కోట్లు నిధులు కావాలని, బడ్జెట్ లో ఈ ప్రస్తావనే లేదన్నారు.

ఏపీ అప్పులపై దుష్ప్రచారం

ఎన్నికలకు ముందు ఏపీ అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని కూటమి పార్టీలు దుష్ప్రచారం చేశాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు అదే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. సూపర్‌ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు.

గత టీడీపీ హాయంలో 2019 నాటికి ఏపీ అప్పు రూ.3.13 లక్షల కోట్లు కాగా, వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. అయితే రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారన్నారు.

చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే, వైసీపీ హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయన్నారు. ఇప్పుడు అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు సవాల్

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతుందని వైఎస్ జగన్ ఆరోపించారు. సోషల్ మీడియా కార్యక్రమాలను అరెస్ట్ చేస్తే తన దగ్గర నుంచే మొదలు పెట్టాలని చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్‌ చేశారు.

చంద్రబాబు మోసాలపై తాను ట్వీట్‌ చేస్తాను. తనతో పాటు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్వీట్‌ చేస్తారన్నారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దామన్నారు. సోషల్‌ మీడియాలో చంద్రబాబు మోసాలను ఎండగడతామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం