YS Jagan : మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక పరిణామం, మళ్లీ ధర్మాసనాన్ని మార్చిన సుప్రీం కోర్టు రిజిస్ట్రీ
YS Jagan : మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీ పిటిషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్పు చేసింది.
YS Jagan : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్పు చేసింది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది.

తొలుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించగా, కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. దీంతో పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనానికి మార్చారు.
గత పన్నేండేళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు. గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు కుమ్మక్కు అయ్యారని, ఒక్క అడుగు కూడా కదలనీయలేదని రఘురామ న్యాయవాది వాదించారు.
డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని, వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జిలు బదిలీ అయ్యారని గుర్తు చేశారు.
బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని, తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని మాత్రమే కోరుతున్నామని న్యాయవాది స్పష్టం చేశారు.
అఫిడవిట్ దాఖలు
సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా... ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉందని రఘురామ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. అదనపు సొలిసిటర్ జనరల్ మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది కోరారు. వచ్చే సోమవారం విచారణ చేపడుతామని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం అదనపు సొలిసిటర్ జనరల్ రాకపోతే, తానే వాదనలు వినిపిస్తానని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. దీంతో కేసు విచారణ వాయిదా పడింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం