Pawan Kalyan: ఇంటర్ మీడియట్‌తో చదువు ఆగినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యాన్నిచ్చాయి- పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఇంటర్మీడియట్‌తో చదువు ఆగిపోయినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యన్ని ఇచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
Pawan Kalyan: ఇంటర్ తో చదువు ఆపేసినా పఠనం ఆగలేదని, పుస్తక పఠనం విషయంలో రవీంధ్రనాథ్ ఠాగూర్ ఓ స్ఫూర్తి అని ఆయన కూడా చదువు తక్కువే చదివినా ఎన్నో కావ్యాలు రాశారని క్లాస్ రూం పుస్తకాలు చదవకున్నా, పఠనం మాత్రం ఎప్పుడూ ఆపలేదని ఇంటర్ తో చదువు ఆపేసినా కూడా ప్రకృతి ప్రేమికుడిగా మారి నాకేం కావాలో తెలుసుకొని దాన్ని చదవడం ద్వారా జ్ఞానం పెంచుకున్నానని పవన్ వివరించారు. స్వతంత్రంగా నాకు ఏం కావాలో నేర్చుకోగలను అనే ధైర్యం వచ్చినపుడు పఠనం మీద దృష్టి నిలిపి నాకు ప్రత్యేకంగా టీచర్ అవసరం లేదని నిర్ణయించుకున్నానని నాకు ఓటమిలోనూ అద్భుతమైన మానసిక శక్తిని పుస్తకాలే అందించాయన్నారు.
జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలేనని నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలేనని 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞాన కాంతులు నిండే సమూహం అవసరంమని అందుకు పుస్తకాలు దారి చూపుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీ యాత్రను మొదలు పెట్టబోతోందని చెప్పారు.
తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ మేధావులు, రచయితల గృహాలను, వారు నడయాడిన నేలను భవిష్యత్తు తరాలవారు అక్షర ఆలయాలుగా దర్శించేలా, అక్కడ భాషా పరిశోధన జరిగేలా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.
• సోషల్ మీడియా కాదు.. పుస్తకం పట్టండి
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవండని పవన్ సూచించారు. దీనివల్ల మీరు మానసికంగా బలంగా మారుతారు. సమస్యలను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుంది. సోషల్ మీడియాలో గంటలకు గంటలు గడిపేకంటే పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను పట్టుకోండి" అని సూచించారు.
తొలిప్రేమ సినిమాకు రూ.15 లక్షల పారితోషికం వస్తే.. దానిలో రూ.లక్ష పెట్టి పుస్తకాలు కొనుక్కోని దేన్ని చదవాలో తెలియక అన్ని పుస్తకాలు చూసి ఆనందపడిన వ్యక్తిని. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 10 వేల పుస్తకాలు చదవవచ్చని నిపుణులు చెబుతారు. మన అభిరుచి ఆధారంగా మీ విజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించండి. పుస్తకాలలో ఉన్న మేధ మరెక్కడా దొరకదు. మీరంతా పుస్తక ప్రియులు కావాలని, తెలుగు భాషను రక్షించాలని, సాహితీవేత్తలను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సూచించారు.
• శ్రీ పి.వి.నరసింహారావు స్మృతి చిహ్నం సాధించుకుందాం
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లిటరరీ మోనోగ్రాఫ్ పుస్తకం ఓ దిక్సూచి. దేశానికి దశ, దిశా చూపిన మహానుభావుడు పీవీ నరసింహారావు అని, ఇక నాకు రాజకీయాలు లేవు అని తన సొంత గ్రంథాలయాన్ని స్వస్థలానికి తరలించుకునే తరుణంలో ఆయన అనుకోకుండా ప్రధాని అయ్యారన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు గ్రంథాన్ని హిందీలో సహస్ర ఫణ్ పేరుతో అనువదించారని అలాంటి గొప్ప సాహితీవేత్త, బహుభాషా కోవిదులైన పీవీ నరసింహారావుకు వినమ్రంగా నమస్కరించడం తప్పితే అలాంటి మహనీయుడి గురించి మాట్లాడే అర్హత ఉందనుకోనన్నారు. అంతటి మేధ వచ్చినపుడు ఆయన గురించి బలంగా మాట్లాడుతానన్నారు.
ఇలాంటి గొప్ప తెలుగువ్యక్తికి, ప్రధానమంత్రిగా దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మరో పథంలోకి తీసుకెళ్లని గొప్ప నాయకుడు పీవీకి ఈ రోజున ఇంతటి అభివృద్ధి జరుగుతోందంటే.. రోడ్లు, సౌకర్యాలు, మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయంటే దానికి పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి వారు కారణం అన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తి తనువు చాలించిన తర్వాత ఢిల్లీలో సరైన అంతిమ సంస్కార కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించలేదని ఢిల్లీలో ఆయనకు నివాళి అర్పించుకుందాం అంటే సరైన వేదిక లేదని ఈ రోజున తెలుగువారిగా మన సంకల్పం ఏమిటంటే - పీవీ గారికి ఢిల్లీలో స్మృతిచిహ్నం సాధించుకోవాలని, రాజకీయాలకు అతీతంగా మనమంతా ఐక్యంగా సాధించుకుందాం. ఇది మనందరి ఆత్మగౌరవ ప్రతీకగా మార్చుకుందాం’’ అన్నారు.