Vijaya Saireddy Reasons: జగన్ వద్దని వారించినా.. సాయిరెడ్డి ఎందుకు ఆగలేదంటే.. కారణం ఇదే!
Vijaya Saireddy Reasons: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా, విదేశీపర్యటనలో ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం, మర్నాడే దానిని రాజ్యసభ అమోదించడం వెనుక ఏం జరిగిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
Vijaya Saireddy Reasons: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహార ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు మింగుడు పడటం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజీనామా అనూహ్యంగా జరిగిందేమి కాదనే అనుమానం వైసీపీలో ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం మర్నాడు రాజ్యసభలో రాజీనామా లేఖను అందించిన వెంటనే దానిని అమోదించడం వెనుక జరిగిన పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డికి తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యలు అప్పగించినా సాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారనే సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీనామా నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఫోన్‌లో వివరించిన సమయంలో ఈ సమయంలో పార్టీని వీడి వెళ్లడం సరికాదని, కొన్నాళ్లు వేచి ఉండాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సాయిరెడ్డి వెనక్కి తగ్గలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పేసి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
సాయిరెడ్డి రాజీనామాకు వ్యక్తిగత కారణాలని చెబుతున్నా భవిష్యత్తు మీద స్పష్టమైన భరోసాతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిక్కుల నుంచి బయట పడటం ప్రధానంగా భావించడం ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసినప్పుడు అందులో నిందితుడిగా శరత్ చంద్రారెడ్డి జైలుకు వెళ్లిన సమయంలోనే సాయిరెడ్డిపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి సమాచారం లేకుండానే సౌత్ గ్రూప్‌లో భాగస్వామ్యం వహించడం, ఆ తర్వాత కేసులు నమోదై జైలుకు వెళ్లే పరిస్థితులు రావడం జగన్‌ను చికాకు పెట్టినట్టు చెబుతున్నారు. అరబిందో గ్రూప్ ఛైర్మన్‌కు వియ్యంకుడైన విజయసాయిరెడ్డి ప్రమేయంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తనకు చుట్టుకుంటుందనే ఆందోళనతో అప్పట్లోనే సాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో జగన్ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
వైసీపీ ఓటమి తర్వాత మరిన్ని చిక్కులు...
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి చిక్కులు తప్పలేదు. ఈ క్రమంలో కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెజ్ బదలాయింపు వ్యవహారాలపై నమోదైన కేసుల్లో విజయసాయిరెడ్డిని కూడా ఈడీ నిందితుడిగా చేర్చింది. ఈ క్రమంలో గత వారం గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ పోర్ట్‌ను తిరిగి కేవీ రావుకు అప్పగించారు. ఈ వ్యవహారం కనీసం జగన్‌కు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిపోయింది.
సాయిరెడ్డి అల్లుళ్లు కొనుగోలు చేసిన కాకినాడ పోర్టును తిరిగి పాత యాజమాన్యానికి అప్పగించడం వెనుక జరిగిన పరిణామాలు సాయిరెడ్డిని ఆందోళనకు గురి చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నారు. సాయిరెడ్డి రాజకీయాల కారణంగా మెట్టినింట్లో కూడా చిక్కులు తలెత్తడం, ఇప్పటికే ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు, కుటుంబంలో వివాదాలు తలెత్తే పరిస్థితులతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయిరెడ్డికి భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఢిల్లీ పెద్దలతో అంగీకారం కుదిరినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాయిరెడ్డి తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన రాజకీయాలు, ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యే క్రమంలో కుమార్తె మెట్టినింట్లో టార్గెట్‌గా మారడం వల్ల వేల కోట్ల రుపాయల నష‌్టాలను ఇప్పటికే ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
గతంలో సుప్రీం కోర్టు రాజకీయ వివాదాల నేపథ్యంలో నమోదైన కేసులు, వాటి విచారణ భవిష్యత్తులో నియామకాలకు అడ్డంకి కాదని ఇచ్చిన తీర్పు సాయిరెడ్డికి కూడా కలిసి వస్తోందని చెబుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికి లాభం చేకూర్చినందుకు సాయిరెడ్డికి కూడా తగిన ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి గతంలో గవర్నర్ పదవులు దక్కిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.