APSRTC Employees: అధిక పెన్షన్ ఆప్షన్‌తో ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు ప్రయోజనం…
APSRTC Employees: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజైషన్ అధిక పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ సదుపాయంతో మూడు రెట్లు అధికంగా పెన్షన్ లభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
APSRTC Employees: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అధిక పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ఏపీఎస్ ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ తక్కువగా పెన్షన్ వస్తోంది.
కండక్టర్, డ్రైవరు కేటగిరీలలో పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ సుమారుగా రూ.5౦౦౦ మాత్రమే లభించేది. ఈ మొత్తంతో రిటైర్ అయిన ఉద్యోగులు ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో హయ్యర్ పెన్షన్ కు నమోదు చేసుకునే అవకాశం తెలియక పోవడంతో పాటు ఈ అవకాశం లేనందున, హయ్యర్ పెన్షన్ కు తమకూ అవకాశం కల్పించమని ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈపీఎఫ్‌ఓ వారికి విన్నపాలు పంపేవారు. వారి డిమాండ్ ఇన్నాళ్లు ‘కల’ గానే మిగిలి పోయింది. సుప్రీమ్ కోర్టు గత ఏడాది నవంబర్ 4న ఇచ్చిన తీర్పుతో సర్వీసులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి హయ్యర్ పెన్షన్ కు అర్హత పొందేందుకు అవకాశం కల్పించారు. అందుకు అనుగుణంగా, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులకు కూడా హయ్యర్ పెన్షన్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
ఈపీఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా హయ్యర్ పెన్షన్ విధి విధానాలను ప్రకటించి ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం పెన్షన్ 5 – 6 రెట్ల మేరకు పెరగనున్నది. పెన్షన్ సుమారుగా రూ.15,౦౦౦ నుంచి రూ. 18,౦౦౦ మేరకు అందనుంది.
పెన్షన్ పెంపుదలతో పదవీ విరమణ చేసిన సిబ్బందిలో మానసిక, ఆర్ధిక స్థైర్యం పెరుగుతుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు జీవన ప్రమాణాల మేరకు తామూ బ్రతకగలమనే నమ్మకం ప్రతి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగిలో వస్తుందన్నారు.
రాష్ట్ర విభజన పరిణామాల నేపద్యంలో, ఈపీటీఓకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఏపీఎస్ఆర్టీసీ చాలా కాలం క్రితమే జమ చేసింది. ఉద్యోగస్తుల ఖాతాలు సమగ్రంగా నిర్వహించడం వంటి కారణాలతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాలను త్వరిత గతిన పంపిణీ చేస్తున్నారు.
ఈపీఎఫ్ఓ గైడ్ లైన్స్, సూచనల మేరకు ఏపీఎస్ఆర్టీసీ అడ్మిన్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి, రాఘవ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ సెక్రటరీ అరుణ మరియు సిబ్బంది, తదితరులు ఎప్పటికప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఈపీఎఫ్ఓ వారికి పంపే పత్రాలను ఎలా పూరించాలి, ఎలా అప్ లోడ్ చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసేవారు.
జిల్లా అధికారులను అప్రమత్తం చేసేవారు. తద్వారా నిర్దిష్ట గడువులోగా దాదాపు అందరి పత్రాలను అప్ లోడ్ చేసినట్లు ఎండీ తెలిపారు. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జి. సత్యనారాయణకు హయ్యర్ పెన్షన్‌లో నెలకు రూ.25,౦౦౦ లుగా నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ వారు జారీ చేసిన ఆమోద పత్రాన్ని ఏపీఎస్ఆర్టీసీకి పంపారు.
ఆ పత్రాన్ని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. ద్వారకా తిరుమల రావు బుధవారం ఆయనకు అందజేసి అభినందనలు తెలిపారు. మరికొద్ది రోజులలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరికీ హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాలు అందనున్నాయని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ వారి పదవీ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన పెన్షన్ మొత్తాలను పొందాలన్న ఆకాంక్ష త్వరగా కార్య రూపం దాల్చటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.
దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థల ఉద్యోగులకు లేని విధంగా, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమె ఈ అవకాశం, ఆమోదం లభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. హయ్యర్ పెన్షన్ పథకాన్ని విజయవంతం చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.