NTR District Crime: కంచికచర్లలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ముగ్గురు నిందితుల అరెస్ట్
NTR District Crime: ఎన్‌టీఆర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై ఆమె స్నేహితుడి సాయంతో ఓ వ్యక్తం అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరంఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

NTR District Crime: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కంచికచర్లలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత మరో ఇద్దరు ఆమెను కోరిక తీర్చాలని వేధిస్తూ వచ్చారు. వారి వేధింపులు తాళలేక యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి, వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువూరుకు చెందిన యువతి (19) ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ఇంజనీరింగ్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె కూడా షేక్ హుస్సేన్‌ను ప్రేమించింది. జనవరి 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఆ విద్యార్థినిని హుస్సేన్ ఇంటికి పిలిచాడు.
అయితే అక్కడ ఎలాంటి ఫంక్షన్ జరగలేదు. దీంతో హుస్సేన్‌ను యువతి ప్రశ్నించింది. ఫంక్షన్ జరగకుండా ఎందుకు పిలిచావని నిలదీసింది. ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ నమ్మించాడు. అనంతరం ఇప్పుడే వస్తానని చెప్పి హుస్సేన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అప్పటికే అక్కడ ఉన్న అదే గ్రామానికి చెందిన పెయింటింగ్ పని చేసే షేక్ గాలి సైదా (26) రూమ్ లోపలకి వెళ్లి, హుస్సేన్‌తో దిగిన ఫోటోలు తన వద్ద ఉన్నాయని ఆ యువతిని బ్లాక్‌మెయిల్ చేశాడు.
అనంతరం ఆ ఫోటోలను బయటపెడతానని బెదిరించి ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. ఇంటి బయట ప్రేమికుడు హుస్సేన్, విద్యార్థిని చదివిన కాలేజీలోనే ఇంజినీరింగ్ చదివే ప్రభుదాస్ కాపలాగా ఉన్నారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బాధితురాలిని ముగ్గురు నిందితులు బెదిరించారు. ఆ తరువాత తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాస్‌లు ఆ యువతిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురినీ అరెస్టు చేశామని ఏసీపీ బాలగంగాధర్ తిలక్ తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)