AP Collectors Conference: ఐదేళ్లలో ఏపీలో అంతులేని విధ్వంసం, ప్రతి నెల 10వ తేదీన పేదల సేవలో కార్యక్రమానికి బాబు శ్రీకారం
AP Collectors Conference: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం అధికారులపై ఉందని సిఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో సూచించారు. ఇకపై మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. ఇకపై ప్రతి నెల 10తేదీన పేదల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
AP Collectors Conference: గాడి తప్పిన పాలనను సరిదిద్దడానికి అధికారులు, ఉద్యోగులు అంతా ఒకే వేవ్ లెంగ్త్‌లో పనిచేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారి నిర్వహించిన కాన్ఫరెన్స్ చారిత్రాత్మక కాన్ఫనెన్స్ అని, ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అందరికి ఉందన్నారు. 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు విధిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమిష్టిగా ముందుకు వెళ్లేలా నడుస్తున్నట్టు చెప్పారు.
ఐదేళ్లకు ముందు అధికారంలోకి వచ్చినాయన ప్రజావేదికలో కలెక్టర్లకాన్ఫరెన్స్ పెట్టి, కాన్ఫరెన్స్ అయిన వెంటనే దానిని కూల్చేస్తామని చెప్పి, ప్రకటన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో విధ్వంసం తప్పలేదన్నారు. తాను మొదటిసారి సిఎం అయినపుడు అధికారుల్లో నైతిక సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో కొంత అవినీతి సమస్య ఉండేది. ఇప్పుడు విధ్వంసం, అధికారుల్ని బెదిరించి పనిచేయించడం జరిగింది. ఐదేళ్లలలో అధికారుల మనోభావాలను దెబ్బతీసారన్నారు.
ఒకప్పుడు ఆంధ్రా బ్యూరోక్రసి అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేదని, ఇక్కడి నుంచి వెళ్లే వారికి కేంద్రంలో కీలక స్థానాలు దక్కేవన్నారు. ఇప్పుడు ఆంధ్రా అధికారులంటే అన్ టచబుల్స్ అయ్యారని,వీళ్లేమి చేయలేరనే భావన వచ్చిందన్నారు. రాష్ట్రమంతటా జరిగిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయాలంటే అదనపు శ్రమ చేయాలన్నారు.
ఐదేళ్ల క్రితం కట్టుకున్న కాన్ఫరెన్స్ హాల్లోనే మళ్లీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఐదేళ్ల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదంటే పాలన ఎలా జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. మూడు నెలల్లో మరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. గంటల తరబడి నిర్వహించనని హామీ ఇచ్చారు. కలెక్టర్లకు పనిచేయకపోతే గ్యారంటీ ఉండదని, ఉపేక్షించే అవకాశమే లేదన్నారు. సమర్థవంతంగా పనిచేయాలని, కలెక్టర్లు అంతా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ సమస్యనైనా మానవత ధృక్పథంతో వ్యవహరించాలని, ఆ దిశగా కలెక్టర్లు పనిచేయాలన్నారు.
పేదల సేవలో….
ప్రతినెల 10వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రూ.2.70లక్షల కోట్లను ప్రజలకు పంచినా ఏనాడు ప్రజల వద్దకు వెళ్లలేదని, సభలు పెట్టినా బలవంతంగా వారిని తెచ్చే పరిస్థితి ఉండేదని ఆ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందన్నారు. నిబంధనల చట్రంలో ఇరుక్కోకుండా మానవతా ధృక్పథంలో పనిచేయాల్సి ఉందన్నారు. పేదల్ని దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, చులకన చేయడం చేయొద్దన్నారు. అలా చేస్తే దాని ప్రభావం ప్రభుత్వానికి వస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
గుజరాత్ తరహాలో కఠిన చట్టాలు…
గుజరాత్ తరహాలో రాష్ట్రంలో మరింత కఠినమైన చట్టాలు చేయాలని, పేదవాడికి అన్యాయం చేయాలంటే భయపేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
బలమైన వ్యవస్థను గత ప్రభుత్వం ఆటబొమ్మగా మార్చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మేము అధికారంలోకి రాకపోయినా వ్యవస్థను బలోపేతం చేయడానికి, డెమోక్రసీని కాపాడటానికి పోరాటం చేశామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదన్నారు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలో బ్యూరోక్రాట్లకు రోల్ మోడల్‌గా ఉండేదని, ఇప్పుడు ఎలా ఉండకూడదు అనడానికి రోల్ మోడల్‌గా మారిందని చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ ఏడాది రాష్ట్రం మొత్తం మీద13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పథకం అమలు గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయనున్నట్టు చెప్పారు. 10వేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ముందుకు తీసుకెళ్ళాల్సి ఉందని తెలిపారు. ఐఏఎస్, పాలనా వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 26 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకుపలు కీలక అంశాలపై సమీక్షించనున్నారు.
ఉ.11.15 గం.ల నుండి 12.25 గం.ల వరకు ప్రాధమిక రంగం,12.25గం.ల నుండి 12.55 గం.ల వరకు సహజ వనరులపై సమీక్షిస్తారు.తదుపరి 12.55గం.ల నుండి 1.50.గం.ల వరకు సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్షిస్తారు.భోజన విరామం అనంతరం 2.45గం.ల నుండి 3.30గం.ల వరకు మానవ వనరులు,3.30 నుండి 4.20.గం.ల వరకు సోషల్ సెక్టార్, సంక్షేమం,4.20.గం.ల నుండి 4.40.గం.ల వరకు హెల్తు సెక్టార్,4.50గం.ల నుండి 5.40గం.ల వరకు అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్,5.40.గం.ల నుండి 5.50 గం.ల వరకు సర్వీస్ సెక్టార్,5.50.గం.ల నుండి 6.20.గం.ల వరకు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై సమీక్షిస్తారు.6.20.గం.ల నుండి 7గం.ల వరకు శాంతి భద్రతలు,7గం.ల నుండి 7.30.గం.ల వరకు ఓపెన్ హౌస్,7.30.గం.ల నుండి 7.45.గం.ల వరకు క్లోజింగ్ రిమార్కులు ఉంటాయి.